సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తనదైన శైలిలో, ముందుకు వెళ్తున్నారు. న్యాయ శాఖ పై తన మార్క్ చూపించాలనే ఉద్దేశంతో, కొన్ని కీలక నిర్ణయాలు ఈ మధ్య కాలంలో తీసుకుని, ప్రజల మన్ననలు పొందారు. చివరకు అవసరం అయితే కేంద్ర ప్రభుత్వానికి కూడా చురకలు అంటిస్తూ, తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ చేసిన పని, ఇప్పుడు తెలంగాణా రాష్ట్రానికి మంచి బెనిఫిట్ అయ్యింది. తెలంగాణా రాష్ట్రం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఆయన నిర్ణయం పై తెలంగాణా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా హైకోర్టులో ఉన్న జడ్జీల సంఖ్యను అమాంతం పెంచేశారు. తెలంగాణా హైకోర్టులో ఇప్పటి వరకు కేవలం 24 మంది న్యాయమూర్తులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా 42కి పెంచుతూ జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. జడ్జిల సంఖ్య పెంచాలి అంటూ గత కొన్నేళ్లుగా అక్కడ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన జరిగిన సమయం నుంచి, తెలంగాణా హైకోర్టుకు జడ్జిల సమస్య వేధిస్తూనే ఉంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ హైకోర్టు, కేంద్రం, సుప్రీం కోర్టు మధ్య అనేక సార్లు ఈ విషయంలో చర్చ జరిగినా, ఇది ముందుకు వెళ్ళలేదు.
జస్టిస్ ఎన్వీ రమణ , సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయిన తరువాత, సత్వరం న్యాయం గురించి స్పందిస్తూ, జడ్జిల కొరత పై మాట్లాడుతూ, తెలంగాణా హైకోర్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ జడ్జిల కొరత వల్ల, అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని, సత్వరం న్యాయం జరగటం లేదని ఆయన చెప్పారు. దేశంలో అన్ని హైకోర్టుల్లో ఉన్న ఈ సమస్య పై దృష్టి పెట్టాలని అన్నారు. చెప్పినట్టుగానే, జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణా హైకోర్టు విషయంలో, జడ్జిల నియామకం ఫైల్ ను ముందుకు నడిపారు. కేంద్రం నుంచి కూడా పాజిటివ్ స్పందన రావటంతో, జడ్జిల సంఖ్యను పెంచుతూ, జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకుంటూ సంతకం పెట్టారు. ఇదే విషయం తెలంగాణా హైకోర్టు చీఫ్ జస్టిస్ కు తెలియ చేసారు. ఇక కేంద్ర న్యాయ శాఖ నుంచి ఉత్తర్వులు అందటమే తరువాయి. ఈ పెంపుతో, ఆంధ్రప్రదేశ్ కంటే, తెలంగాణాకు 5 గురు న్యాయమూర్తులు అధికంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 37 ఉండగా, తెలంగాణా రాష్ట్రానికి 42 మంది ఉన్నారు.