జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, తనకు నచ్చని వాళ్ళని ఎలా టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారో, ఈ రెండేళ్ళలో చూస్తూనే ఉన్నాం. అవినీతి ఆరోపణలు చేసి చేసి, చివరకు ఏ ఆధారం దొరక్క పోవటంతో, ఎస్సీ, ఎస్టీ కేసులు, మీసం తిప్పారని కేసులు, కో-వి-డ్ కేసులు, ఇలా పెట్టుకుంటూ వస్తున్నారు. రాజకీయ నాయకులనే కాదు, తనని ఇబ్బంది పెట్టిన అధికారుల పై కూడా ఇలాగే టార్గెట్ పెట్టుకున్నారు. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర రావుని జగన్ ప్రభుత్వం ఇలాగే టార్గెట్ చేసింది. అధికారంలో వచ్చిన వెంటనే, ఆయన పై నిఘా పరికరాల స్కాం అంటూ అభియోగాలు మోపి, ఆయన్ను సస్పెండ్ చేసారు. దీని పై ఆయన ఇప్పటికే కోర్టుకు వెళ్ళారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం శాఖాపరమైన విచారణ జరిగింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ సిసోడియా ఎదుట ఆయన విచారణకు కూడా హాజరు అయ్యారు. అయితే ఇది ఇంకా విచారణ దశలోనే ఉండగా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, నిన్న రాత్రి ఒక రహస్య జీవో ఇచ్చి, ఆయన పై అభియోగాలు అన్నీ ఫైల్ రూపంలో పెట్టి, ఆయన్ను డిస్మిస్ చేయాలి అంటూ, కేంద్రానికి పంపించటం సంచలనంగా మారింది. ఒక ఐపిఎస్ స్థాయి అధికారిని డిస్మిస్ చేయాలి అంటూ, మన రాష్ట్రం నుంచి ప్రతిపాదన వెళ్ళటం ఇదే మొదటి సారి అని చెప్తున్నారు.
అయినా ఏబి వెంకటేశ్వర రావు అసలు ఏమి చేసారో, ఆయన పై ఉన్న అభియోగాలు నిజమో కాదో, విచారణ రిపోర్ట్ రాక ముందే, అలాగే సుప్రీం కోర్టులో తీర్పు రాకముందే, ప్రభుత్వం ఇలా ఎందుకు తొందర పడిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. కేంద్రం కూడా ఊరికే , డిస్మిస్ చేయటానికి వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆధారాలు ఇవ్వకుండా, విచారణ పూర్తి కాక ముందే, రాష్ట్ర ప్రభుత్వం తొందర పడి ఎందుకు, డిస్మిస్ చేయమని కోరుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే కేంద్రం అంత తేలికగా నిర్ణయం తీసుకోదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరో వాదన, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విచారణ తరువాత, ఏబి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ, కొంత మంది అధికారులు తన పై కుట్ర చేసారని చెప్పారని, అలా మీడియాతో మాట్లాడటం సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకంగా కాబట్టి, ఆ విషయంలో డిస్మిస్ చేయమని రాష్ట్రం కోరినట్టు చెప్తున్నారు. మరి ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా ఒక ఐపిఎస్ స్థాయి అధికారిని కేంద్రం డిస్మిస్ చేస్తుందా ? మరి కేంద్రం ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.