ఎంపీ రఘురామరాజుకి, వైసీపీ నుంచి కష్టాలు ఎదురు అవుతూనే ఉన్నాయి. సొంత పార్టీని కొన్ని విషయాల్లో కరెక్ట్ చేసుకోమని చెప్పినందుకు, ఆయన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో ఎంపీ రఘురామరాజుని టార్గెట్ చేసారు, మరో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. తనను అసభ్య పదజాలంతో గోరంట్ల మాధవ్ దూషించారు అంటూ రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. పార్లమెంట్ ఆవరణలోనే అసభ్య పదజాలంతో దూషించటంతో, ఎంపీ రఘురామకృష్ణం రాజు, స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసారు. ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలిపిన వివరాలు మేరకు, పార్లమెంట్ వాయిదా పడిన అనంతరం, పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో, మరి కొంత మంది ఇతర రాష్ట్రాల ఎంపీలతో కూర్చుని ఉండగా, తన వద్దకు ఎంపీ గోరంట్ల మాధవ్ వచ్చి, ఎందుకు జగన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెడుతున్నావ్, ఇంకోసారి జగన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెడితే మీ అంతు చూస్తాం, వెంటనే ఇలాంటి ప్రెస్ మీట్లు ఆపేయాలి అంటూ, వేలు పెట్టి గోరంట్ల మాధవ్ హెచ్చరించారని తెలిపారు. రాయటానికి, చెప్పటానికి వీలు లేని పదాలు గోరంట్ల మాధవ్ ఉపయోగించారని, పార్లమెంట్ లాంటి పవిత్రమైన చోట, ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉంది, మరో ఎంపీని ఇష్టం వచ్చినట్టు, బూతులతో దూషించటంపై, ఇతర పార్టీ నేతలు కూడా షాక్ అయ్యారు.
అయితే ఆ సమయంలో రఘురామకృష్ణం రాజు ఎక్కడా రెచ్చిపోకుండా ఎంతో సమన్వయంతో వ్యవహరించి, ఆయనతో ఏమి మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవటంతో, పెద్ద గొడవ తప్పినట్టు అయ్యిందని తెలుస్తుంది. అయితే ఆ సమయంలో, గోరంట్ల మాధవ్, రఘురామకృష్ణం రాజుని హెచ్చరించే సమయంలో, ఆయన పక్కనే ఉన్న, ఇతర రాష్ట్రాల, పార్టీల ఎంపీలు అందరినీ కూడా తీసుకుని వెళ్లి, వెంటనే అక్కడికక్కడే, లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేసారు. గోరంట్ల మాధవ్ తనని పార్లమెంట్ ఆవరణలో బెదిరించారని, అంతం చూస్తానని బెదిరించారని, దీనికి సహచర ఎంపీలే సాక్ష్యం అని కూడా ఆయన స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. అంతే కాకుండా, అక్కడ సిసి కెమెరాలు కూడా ఉంటాయి కాబట్టి, అక్కడ వీడియో ఫుటేజ్ కూడా చూస్తే, మాటలు వినిపించకపోయినా వీడియోలో గోరంట్ల మాధవ్ హావభావాలు స్పష్టంగా తనని బెదిరించినట్టు కనిపిస్తాయని ఫిర్యాదు చేసారు. మరి దీని పై స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.