జగన్ రెడ్డి అవినీతి మురికి కూపంలో నుంచి మరో మురికి ఒప్పందం తాలూకా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని, వై.ఎస్.కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, జగన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి సంబంధించిన అక్రమ డీల్ కు చట్టబద్ధత కల్పించేలా జగన్ రెడ్డి ప్రభుత్వం అధికార ముద్ర వేసిందని, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం... "15-07-2021న అంటే నిన్న జగన్ ప్రభుత్వం నిన్న జీవో (నం-54) ఇచ్చింది. నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం, చిలుకూరులోని 860 ఎకరాల భూమిని జిందాల్ స్టీల్స్ వారికి, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం కేటాయిస్తున్నట్లు ఆ జీవోలో ప్రభుత్వం చెప్పింది. 860 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారం లోతుల్లోకి వెళితే, జగన్మోహన్ రెడ్డి , బాలశౌరీలు గతంలో చేసుకున్న చీకటి ఒప్పందం తాలూకా వివరాలు బయటకు వస్తాయి. బాలశౌరి వారి శ్రీమతి భానుమతిలు కలిసి 01-02-2006న కిన్నెటా పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని, కేవలం లక్ష రూపాయల మూలధనంతో ఏర్పాటు చేశారు. 08-10-2007 న ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (ఏపీఐఐసీ) వారికి 1980 మెగావాట్లకు సంబంధంచి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు కిన్నెటా పవర్ వారు దరఖాస్తు చేశారు. ఎలాంటి అనుభవం లేకపోయినా థర్మల్ విద్యుత్ తయారు చేస్తామని దరఖాస్తు పెట్టుకున్నారు. తరువాతి కాలంలో దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో కిన్నెటా పవర్ వారికి కావాల్సిన అనుమతులన్నీ చకచకా వచ్చేశాయి. కిన్నెటా పవర్ అనేది కిన్నెటా గ్రూపులో ఒకభాగం. కిన్నెటా గ్రూప్ లోనే కిన్నెటా మినరల్స్ అండ్ మెటల్స్ అనే సంస్థ కూడా ఉంది. కిన్నెటా మినరల్స్ అండ్ మెటల్స్ ద్వారా ఓబుళాపురం మైనింగ్ మెటీరియల్ కు సంబంధించి, కిన్నెటా ఇంటర్నేషనల్ అని సింగపూర్లో మరో కంపెనీని రిజిస్టర్ చేయించారు. కిన్నెటా గ్రూప్ అనేది ఓబుళాపురం మైనింగ్ లో తవ్విన ఖనిజాన్ని ఇతర దేశాలకు తరలించి డబ్బు కొల్లగొట్టడానికి ఏర్పాటు చేసిందే. ఆ గ్రూప్ కు చెందినదే కిన్నెటా పవర్ సంస్థ కూడా. దుబాయ్ లోని మార్స్ రిసోర్సెస్ అనే కంపెనీ కిన్నెటా పవర్ లోకి 16-09-2008న షేర్ హోల్డర్ గా జాయిన్ అయ్యి, దాదాపుగా రూ.10ల విలువతో కూడిన కోటి 50 లక్షలషేర్లను ఇన్వెస్ట్ చేసింది. మార్స్ రీసోర్సెస్ అనే కంపెనీ కూడా బాలశౌరి, బినామీలకు చెందిన కంపెనీనే.
ఎఫ్ డీఐ నిబంధనలకు వ్యతిరేకంగానే మార్స్ రీసోర్సెస్ షేర్లను కిన్నెటా పవర్ లో పెట్టుబడి పెట్టారు. అదలా ఉంటే, తరువాతి కాలంలో నెల్లూరు జిల్లాలోని 814.17 ఎకరాల భూమిని ఎకరం రూ.80 వేలకు మాత్రమే బాలశౌరి కిన్నెటా పవర్ కు నాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టింది. ఆనాడు ఏపీఐఐసీ వారు నిర్ణయించిన కనీస ధర రూ.2లక్షలైతే, కేవలం రూ.80వేలకే కిన్నెటాకు నాటి ప్రభుత్వం భూమిని కట్టబెట్టిం ది. అందుకోసం ప్రత్యేక మెమోను (మెమోనెం-6359) కూడా జారీచేసింది. ఈ వ్యవహారమంతా పూర్తయ్యాక కిన్నెటా పవర్ లోకి కృష్ణపట్నం పోర్టు కంపెనీ వారు ఎంటరయ్యారు. దాదాపు రూ.90షేర్ ధరతో, దాదాపు రూ.90 కోట్లను కృష్ణపట్నం పోర్టు కంపెనీ కిన్నెటా పవర్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలా వచ్చిన సొమ్ములో నుంచే ఎకరం రూ.80వేల చొప్పున ఏపీఐఐసీ వారికి కిన్నెటా పవర్ చెల్లింపులు చేసింది. తరువాత కృష్ణపట్నం పోర్టు వారు రూ.31 కోట్లు ఒకసారి, రూ.4 కోట్ల 65లక్షలు ఇంకోసారి, మొత్తంగా మూడుసార్లు అధిక ధరలు చెల్లించిమరీ షేర్లు కొని కిన్నెటా పవర్ లోకి నిధులు మళ్లించారు. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే గతంలో ఇచ్చిన 814 ఎకరాలకు తోడు, మరలా ఇంకో26 ఎకరాలను కిన్నెటా పవర్ వారికి ప్రభుత్వం కట్టబెట్టింది. ఆ విధంగా దాదాపు 840 ఎకరాల భూమి కిన్నెటా పవర్ పరమైంది. కృష్ణపట్నం పోర్టువారు కిన్నెటా పవర్ లో పెట్టిన షేర్లు, మార్స్ రీసోర్సెస్ కంపెనీవారి షేర్లు తరువాతి క్రమంలో జిందాల్ పవర్ కు బదలాయించడం జరిగింది. ఇక్కడే అసలు క్విడ్ ప్రోకో మొదలైంది. తద్వారా వచ్చిన సొమ్ముతో మార్స్ రీసో ర్సెస్ అనే దుబాయ్ కంపెనీ ఏదైతే ఉందో, అది బెంగుళూరుకి చెందిన పురుషోత్తం నాయుడు అనే అతనికి చెందిన స్వగృహ ఎస్టేట్స్ అండ్ కన్ స్ట్రక్షన్స్, స్వగృహ హోటల్స్ అనే రెండు కంపెనీల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం జరిగింది.
ఏ మార్స్ రీసోర్సెస్ అయితే కిన్నెటా పవర్ లో పెట్టుబడి పెట్టిందో, ఏ మార్స్ రీసోర్సెస్ అయితే జిందాల్ పవర్ కి తన వాటాలు అమ్మేసిందో, అదే మార్స్ రీసోర్సెస్ కంపెనీ బెంగుళూరుకు చెందిన స్వగృహ ఎస్టేట్స్ అండ్ కనస్ట్రక్షన్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసింది. ఆ డబ్బులు వచ్చాక వెంటనే పురుషోత్తం నాయుడు మొత్తం తీసుకెళ్లి జగతి పబ్లికేషన్స్ లో ఇన్వెస్ట్ చేసేశారు. అదీ కథ... నిధుల దారిమళ్లింపు కథ. జగతి పబ్లికేషన్స్ జగన్మోహన్ రెడ్డి కంపెనీ. థర్మల్ పవర్ ప్లాంట్ నిమిత్తం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి ఏర్పాటు చేసిన కిన్నెటా పవర్ కంపెనీ, దానిలోని రకరకాలుగా ముందుగా డబ్బులు మళ్లించారు. ముందేమో బాలశౌరి బినామీ కంపెనీ అయిన దుబాయ్ కిచెందిన మార్స్ రీసోర్సెస్ ద్వారా కొంతసొమ్ము, తరువాతేమో కృష్ణపట్నంపోర్టు కంపెనీ వారి ద్వారా మరికొంత డబ్బు పెట్టుబడి పెట్టించారు. ఆ డబ్బుతోనే ప్రభుత్వ నుంచి రూ.2లక్షల ఖరీదు చేసే భూమిని రూ.80వేలకు కొన్నారు. తరువాత అదే భూమని జిందాల్ పవర్ వారికి బదలాయిస్తారు. ఆ వెంటనే మార్స్ రీసోర్సెస్ కంపెనీ షేర్లు, కృష్ణపట్నం పోర్టు కంపెనీ షేర్లు జిందాల్ పవర్ లోకి వెళ్లిపోతాయి. ఆరకంగా వెళ్లిపోయాక మార్స్ కంపెనీ వారు ఆశ్చర్యకరంగా బెంగుళూరులోని స్వగృహ ఎస్టేట్స్ అండ్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీలో డబ్బులు పెట్టుబడి పెడితే, దాదాపు రూ.145 కోట్ల సొమ్ము, పురుషోత్తంనాయుడి ద్వారా తిరిగి జగతి పబ్లికేషన్స్ లోకి వచ్చి పడింది. ఇది జగనన్నకు బాగా ఇష్టమైన క్విడ్ ప్రోకో కథల్లో ఒక కథ. ఆ రకంగా అటూఇటూ తిరిగి తన కంపెనీలోకి సొమ్మలు వచ్చేలా చేసిన వ్యవహారానికి, భూములప్పగించే వ్యవహారానికి ఈముఖ్యమంత్రి ఇప్పుడు రాజముద్ర వేశారు.