పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకమైన గ్రామ సర్పంచ్ ల అధికారాలను పక్కన పెట్టేసి, రెవెన్యూ యంత్రాంగానికే విశేష అధికారాలు కట్టబెడుతూ, ప్రభుత్వమిచ్చిన జీవో-2ని హైకోర్టు కొట్టేసిందని, స్వాతంత్ర్యానంతరం స్వయం సంపూర్ణ గ్రామ ఆర్థిక వ్యవస్థను నిర్మించుకునే క్రమంలోప్రధానమైన స్థానిక స్వపరిపాలనకు బీజం వేయడం జరిగిందని టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! "జగన్మోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల వాదనను, నిర్ణయాలను సమర్థిస్తూ, వారికి అనుకూలంగా రాతలు రాస్తున్న వారిని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను. అధికార వికేంద్రీకరణకోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నానని గతంలో జగన్మోహన్ రెడ్డి నిండు శాసనసభలో చెప్పారు . అధికార వికేంద్రీకరణంటే కేవలం కార్యాలయాలను తరలించడమనే పిచ్చిఆలోచన జగన్ లో ఉందని ఆనాటి ఆయన వ్యాఖ్యలతో నే అర్థమైంది. నేడు అదేమాదిరిగా వ్యవహరిస్తున్నాడు. అధికార వికేంద్రీకరణంటే, ప్రభుత్వ అధికారాలన్నీ జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు బదలాయించాలని భావించడం. కానీ పంచాయతీల అధికారాలను రెవెన్యూ వ్యవస్థ చేతిలో పెట్టడం అధికారాల బదలాయింపు ఎలా అవుతుంది? రెవెన్యూ వ్యవస్థ చేయాల్సిన పనులే సక్రమంగా చేయడం లేదు. చాలా ప్రాంతాల్లో ఎప్పుడో జరిగిన పంట నష్టం లెక్కలనే ఇంత వరకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి సమర్పించ లేకపోయారు. అడిగితే పని భారమంటున్నారు. అలాంటి వారికి తిరిగి పంచాయతీల అధికారాలు అప్పగిస్తే, ప్రజలు వారిచుట్టూ ఎన్నాళ్లుతిరగాలి?"

"గ్రామంలోని సర్పంచ్ ను డమ్మీ చేయడానికే ప్రభుత్వంఈ పని చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా , రాజ్యాంగానికి లోబడి ఎన్నికైన సర్పంచ్ లను తోలు బొమ్మలను చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. రాష్ట్రంలో తనదైన ముద్ర ఉండాలనే ఆలోచనతో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయిన కొందరు దుర్మార్గుల మాదిరే తాను తన పాలనతో చరిత్రలో నిలవాలని ముఖ్యమంత్రి తహతహలాడుతున్నట్లు ఉంది. గ్రామాల్లో కొందర్ని అడ్డగోలుగా నియమిస్తూ, గ్రామస్వరాజ్యం అంటే సరిపోతుందా? రాష్ట్రంలో ఒక అయోగ్యుడికి, దుర్మార్గుడికి, అవగాహన లేని వాడికి అధికారం దక్కితే, ఎలా ఉంటుందనే దానికి నిదర్శనంగానే ముఖ్యమంత్రి చర్యలున్నాయి. ఎక్కడా ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగానికి లోబడి నడుచుకోవడం లేదు. ఇప్పటికే హైకోర్టు 168 సార్లకు పైగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చురకలు, మొట్టికాయలు వేసింది. హైకోర్టు తప్పుపట్టిన జీవోనెం-2కి సవరణలు చేసి, తిరిగి తీసుకొస్తామని చెప్పడం ద్వారా రాష్ట్రాన్ని తన సొంత రాజ్యంగా, జాగీరుగా మార్చాలని ముఖ్యమంత్రి చూస్తున్నా డా? నియంతలా ముందుకు పోవాలని చూడటం ముఖ్యమంత్రికి మంచిది కాదు. గ్రామ స్వరాజ్యాన్ని ధ్వంసంచేసే జీవోనెం-2ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేకుంటే న్యాయస్థానాలతో పాటు, ముఖ్యమంత్రి దుర్మార్గాలు, నియంత్రత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడటానికి తాముకూడా సన్నద్ధమ వుతామని స్పష్టం చేస్తున్నాము."

Advertisements

Advertisements

Latest Articles

Most Read