నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స తీసుకుని, ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణా వచ్చి, తనను అరెస్ట్ చేయటం, అలాగే అరెస్ట్ సందర్భంలో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించటం, తదితర పరిణామాల పై, రఘురామకృష్ణం రాజు, కేసిఆర్ కి, 8 పేజీల లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వచ్చి, ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో ఫాలో అవ్వాల్సిన మార్గదర్శకాలను, తెలంగాణా పోలీసులు పాటించలేదని తెలిపారు. ముఖ్యంగా గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ టార్గెట్ గా రఘురామకృష్ణం రాజు, ఈ లేఖలో అనేక అంశాలు కేసీఆర్ కు తెలిపారు. గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారని, అతని పై రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలతో పాటుగా, పోలీస్ మాన్యువల్ ని కూడా రఘురామరాజు జత పరిచారు. తన పై పెట్టిన కేసు గురించి వివరిస్తూ, ఏపి సిఐడి కేసు పెట్టిందని, సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ ఈ కేసుని పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 14న హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న తన విల్లాకు ఒక బృందం ఏపి నుంచి వచ్చిందని చెప్పారు.
ఏపి పోలీసులు తన ఇంటికి వచ్చిన సమయంలో, గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా ఉన్నారని, ఆయన కనీస నిబంధనలు కూడా పాటించలేదని తెలిపారు. తాను ఒక ఎంపీని అని, పక్క రాష్ట్రం నుంచి పోలీసులు తనను అరెస్ట్ చేయటానికి వస్తే, కనీసం ఆ కేసుకు సంబందించిన ప్రాధమిక సమాచారం కూడా గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ చూడలేదని, కనీసం ట్రాన్సిట్ రిమాండ్ ఆర్డరు అడగలేదని, అసలు కేసు ఏంటో ఎఫ్ఐఆర్ ఏంటో కూడా చూడలేదని అన్నారు. నిబంధనలు ప్రకారం, తనకు ఇక్కడే వైద్య పరీక్షలు చేసి పంపించాల్సి ఉన్నా, అది కూడా పట్టించుకోలేదని గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని తప్పుబట్టారు. తనని అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా, ఏపి పోలీసులు నేట్టేస్తుంటే, ఈయన చూస్తూ ఉన్నారు కాని, వారించలేదని అన్నారు. నిబంధనలు అనుసరించకుండా, ఇష్టం వచ్చినట్టు చేసిన, ఈ అరెస్ట్ లో ప్రమేయం ఉన్న, తెలంగణా పోలీసులు పై, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.