నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు, ఈ రోజు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో పరీక్షలు ముగిసాయి. పరీక్షలు అనంతరం, ఆయన ఢిల్లీలో ఉన్న తన అధికారిక నివాసానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. అవసరం అయితే, రేపు కాని, ఎల్లుండి కాని, ఆయన మళ్ళీ పరీక్షలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. అయితే ఈ రోజు జరిగిన పరీక్షల్లో, ఎయిమ్స్ డాక్టర్లు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. రఘురామరాజు పాదాలు, అరికాళ్ళు బాగా ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. అనుకున్నదాని కంటే, ఆయన పాదాలకు ఎక్కువగా డ్యామేజ్ అయినట్టు, ఆయనకు ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. గతంలో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్, అదే విధంగా సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో పరీక్షలు నిర్వహించినప్పిటికీ కూడా, ఆ రెండు హాస్పిటల్ లో జరిగిన పరీక్షలు కంటే, ఈ రోజు ఎయిమ్స్ లో జరిగిన పరీక్షల్లో మరింతగా ఆయన కాళ్ళ సెల్స్ డ్యామేజ్ అయినట్టు గుర్తించారు. అనేక ఆధునాతమైన పరికరాలతో, అడ్వాన్స్ పరికరాలతో, ఈ పరీక్షలు నిర్వహించారని తెలుస్తుంది. సిటీ స్కాన్, ఎమ్మారై స్కాన్ తోపాటుగా, ఇతర స్కానింగ్ లు, ఇతర పరీక్షలు కూడా నిర్వహించిన డాక్టర్లు, అరికాళ్ళు బాగా ఎక్కువగా డ్యామేజ్ అయినట్టు గుర్తించారు.
దీంతో రఘురామరాజు రెండు కాళ్ళకు, పివోపీ కట్టు కట్టారు. రఘురామరాజు, రెండు వారాల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని, ఆయన ఎక్కడికీ తిరగకూడదని, కాళ్ళు కింద పెట్టకూడదని, అని డాక్టర్లు సలహా ఇచ్చారు. అందుకే ఆయన నడవకుండా ఉండటానికి, పూర్తిగా రెస్ట్ అవసరం కాబట్టి, కాళ్ళకు కట్టు కట్టారు. అయితే ఆయనకు చేసిన వివిధ రకాల బ్లడ్ టెస్ట్ వివరాలు, మరో ఒకటి రెండు రోజుల్లో వస్తాయని, మరింతగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రెండు రోజుల క్రితం, రఘురామరాజు ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి, వెంటనే ప్రత్యెక విమానంలో, ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు వెళ్ళిపోయారు. అక్కడ ఆయనకు వైద్యం చేసి, వివిధ రకాల పరీక్షలు చేసారు. మరో పక్క ఈ రోజు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్, రఘురామరాజుకు ఫోన్ చేసారు. ఘటన జరిగిన వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎయిమ్స్ వైద్యులకు కూడా అన్ని రకాల పరీక్షలు చేయాలని, సూచించారు.