ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఈ రోజు మరో బాంబు పేల్చారు. ఈ రోజు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ని, రఘురామరాజు కలిసారు. ఈ సందర్భంగా పలు సంచలన ఆరోపణలు చేసారు. అంతే కాదు, దానికి సంబందించిన ఆధారాలు కూడా ఇచ్చారు. సుమారుగా 30 నిమిషాలు పాటు జరిగిన ఈ సమావేశంలో, ఆర్మీ హాస్పిటల్ పై రఘురామరాజు సంచలన ఆరోపణలు చేసారు. తన అరెస్ట్, తరువాత సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆర్మీ హాస్పిటల్ కు రావటం, ఆ తరువాత అక్కడ జరిగిన అంశాలను పూస గుచ్చినట్టుగా వివరించారు. మూడు పేజీల లేఖతో పాటు, ఆధారాలు కూడా రాజ్‌నాథ్‌సింగ్ కు ఇచ్చారు. ప్రధానంగా ఆర్మీ హాస్పిటల్ కు సంబందించిన రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసారు రఘురామరాజు. ప్రస్తుతం ఆర్మీ హాస్పిటల్ లో అసిస్టెంట్ కమాండ్ ర్యాంక్ లో రిజిస్ట్రార్ ఉన్న కేపీ రెడ్డి, తనను త్వరగా డిశ్చార్జ్ చేసి, మళ్ళీ ఏపి పోలీసులకు అప్పగించేందుకు ప్రయత్నం చేసారని అన్నారు. ప్రస్తుతం ఏపి ప్రభుత్వంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి గతంలో డిఫెన్సు లో పని చేసేవారని, ఆ పరిచయాలతో, ఈయన కూడా ఈ కుట్రలో భాగం అయ్యారని, ఈయనతో పాటుగా, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారని ఆ లేఖలో తెలిపారు.
కేపీరెడ్డి, ధర్మారెడ్డి, అమ్మిరెడ్డి, ముగ్గురు కలిసి తన పై కుట్ర పన్నారని, తనను పోలీసులకు ఇచ్చేందుకు కేపీ రెడ్డి చేయని ప్రయత్నం లేదని అన్నారు. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి అని, ఆయన పై చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ని కోరారు. ఆర్మీ హాస్పిటల్ కు వచ్చిన తరువాత, వెంటనే ట్రీట్మెంట్ చేసి, తనను వెంటనే పోలీసులకు అప్పగించేలా కేపీ రెడ్డి డాక్టర్ల పై బలవంతం చేసారని అన్నారు. ఆ ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని అన్నారు. ధర్మారెడ్డి హైదరాబాద్ వచ్చి, కేపీ రెడ్డితో సమావేశం అయ్యారని, మెడికల్ రిపోర్ట్ లను తారుమారు చేసే ప్రయత్నం చేసినా, మెడికల్ బోర్డు ఒప్పుకోకుండా, సరైన రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. ఆర్మీ హాస్పిటల్ లో కూడా ఏపి పోలీసులు మఫ్తీలో మకాం వేసారని, 15 మంది పోలీసులు ఇక్కడే ఉన్నారని, వారి భోజనాలు కూడా కేపీ రెడ్డి ఏర్పాట్లు చేసారని, వారి మెస్ బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని, ఆ బిల్లులు కూడా కేంద్ర మంత్రికి ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారం పై, విచారణ చేసి, అందరి పై చర్యలు తీసుకోవాలని కోరారు.