ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, ఈ తరానికి గుర్తుండిపోయేది, కళ్ళ ముందు ఇప్పటికీ కనిపిస్తూ ఉండేది, రాష్ట్ర విభజన నాటి పరిణామాలు, దాని తరువాత వచ్చిన విభజన హామీలు, పార్లమెంట్, రాజ్యసభలో చర్చ, ఆ తరువాత బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు పాతర వేయటం, ఇప్పుడు పోలవరం, అమరావతి కూడా ఆగిపోయే పరిస్థితి రావటం. ఈ మొత్తం అంశాలను దగ్గరుండి, మొదటి నుంచి సాక్షి మాత్రమే కాకుండా, ఒక విధంగా బాధ్యతగల స్థానంలో ఉన్న 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ , ఈ మొత్తం వ్యవహారం పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్‌కే సింగ్‌ పోర్ర్టెయిట్స్‌ ఆఫ్‌ పవర్‌ అనే ఒక పుస్తకం రాసారు. ఈ పుస్తకంలో అనేక అనేక అంశాలు ప్రస్తావించారు. అందులో మన రాష్ట్రానికి సంబందించిన అంశాలు, రాష్ట్ర విభజన నాటి పరిణామాలు, ప్రత్యేక హోదా. ఎన్‌కే సింగ్ తన పుస్తకంలో విభజన నాటి అంశాలు ప్రస్తావిస్తూ, అప్పట్లో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, విభజన బిల్లు పాస్ అయ్యే సమయంలో, ఎంతో భావేద్వాగానికి గురైన అంశాలను గుర్తు చేసారు. అయితే ఆ సమయంలో రాష్ట్ర విభజన బిల్లు, ఫైనాన్షియల్‌ మెమోరాండం లేకుండా ప్రవేశ పెట్టారని, ఇది సరైన పద్దతి కాదని అప్పుడే అనుకున్నామని అన్నారు. ఈ విభజన బిల్లు పెట్టటమే ఒక విచిత్రమైన అంశం అని అన్నారు. అయితే ఆ సమయంలో వెంకయ్య నాయుడు చాలా చొరవ తీసుకుని, ప్రతి అంశం పై పరిశీలించి, తన వాదనలు వినిపించారని, గుర్తు చేసారు.

nksingh 02112020 2

ఇక ప్రత్యేక హోదా గురించి కూడా అయన అనేక వ్యాఖ్యలు చేసారు. ఆనాటి ప్రధాని రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించారని చెప్పుకొచ్చారు. అయితే, తదనంతర పరిణామాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పిందని, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగానే, ఆయన బీజేపీ నుంచి దూరం అయ్యి, ఎన్డీఏ నుంచి తప్పుకున్నారని అన్నారు. తన సొంత రాష్ట్రం బీహార్ కూడా ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కోరుకుంటున్నా, ఇప్పటికీ ఆ కల నెరవేరలేదని అన్నారు. బీహార్ కు ప్రత్యెక హోదా వచ్చే అవకాశాలు లేవని, కేంద్ర ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయని అన్నారు. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అది కేంద్రం ఇష్టం అని, 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కానీ, 14వ ఆర్ధిక సంఘం ఎక్కడా ఆ మాట చెప్పలేదని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రత్యేక హోదా అనేది ప్రజల మనసుల్లో ఉంటూనే ఉందని, ఆ హామీ ప్రజలకు గుర్తుందని, అందుకే ఇప్పటికీ రాజకీయ నాయకులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారని అన్నారు. ఆ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read