ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, హెబియస్ కార్పస్ పిటిషన్‍పై ఈ రోజు మళ్ళీ వాదనలు జరిగాయి. హెబియస్ కార్పస్ పిటిషన్‍పై హైకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ నిర్వహించింది. ఇందులో, ముఖ్యంగా రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే విషయం పై, హైకోర్టులో జరుగుతున్న విచారణ పై సుప్రీం కోర్టులో, స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసామని, అంత వరకు కూడా విచారణ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనం ముందు వాదించారు. అయితే స్పెషల్ లీవ్ పిటీషన్ పై, సుప్రీం కోర్టు ఎటువంటి నిర్ణయం అయినా తీసుకుందా అని చెప్పి, హైకోర్టు ప్రశ్నించింది. అయితే స్పెషల్ లీవ్ పిటీషన్ తాము దాఖలు చేసామని, సుప్రీం కోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించ లేదు అని చెప్పి, ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. అయితే దీని పై స్పందించిన ధర్మాసనం, సుప్రీం కోర్టు స్టే ఇస్తే అప్పుడు విచారణ ఆపుతామని చెప్పింది. ప్రస్తుతానికి మాత్రం వాదనలు కొనసాగించాలని చెప్పి ప్రభుత్వ న్యాయవాదులకు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే రాజ్యాంగ విచ్ఛిన్నం ఏ అంశం పై జరిగిందో తాము వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తాము ఈ విషయం పై గతంలోనే చెప్పాం కదా అంటూ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
అయితే మీరు గతంలో మౌకికంగా చెప్పారు, రాత పూర్వకంగా ఇచ్చిన ఆర్డర్స్ లో ఈ అంశం ఎక్కడా లేదు కదా అని ప్రభుత్వ తరుపు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. తమకు రాత పూర్వకంగా రాజ్యాంగ విచ్ఛిన్నం ఏ అంశం పై జరిగిందో చెప్తే, దాని పై మేము వాదనలు వినిపించటానికి కానీ, అఫిడవిట్ దాఖలు చేయటానికి కానీ తాము సిద్ధం అని ప్రభుత్వ తరుపు న్యాయవాది చెప్పారు. అయితే ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై, సుప్రీం కోర్టులో కూడా ఒక నిర్ణయం వచ్చే అవకాసం ఉంది అని కూడా ధర్మాసనం ముందు వివరించారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు ధర్మాసనం, ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ రోజు సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు వస్తే, సుప్రీం కోర్టు ఆదేశాల పై హైకోర్టు రియాక్ట్ అవుతుంది. లేకపోతే రేపు విచారణ యధా ప్రకారం ఉండే అవకాసం ఉంది. ఇప్పటికే ఈ అంశం అనేక విధాలుగా మలుపులు తిరుగుతుంది. హైకోర్టు , రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తరువాత, ఈ కేసు ఎటు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.