ఈ రోజు అసెంబ్లీలో విద్యుత్‌ సవరణ బిల్లులోని, అసైన్డ్‌ భూములు లీజు అంశాలపై చర్చ జరిగింది. అయితే ఈ బిల్లులో సోలార్ పార్కులు పెట్టటం కోసం, అసైన్డ్‌ భూములు తీసుకోవచ్చు అని ఉండటం పై, తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. దీని పై తెలుగుదేశం పార్టీ వాక్ అవుట్ చేసింది. ఇదే విషయం పై చంద్రబాబు అసెంబ్లీ ప్రాంగణం నుంచే వీడియో మెసేజ్ విడుదల చేసారు. ఆయన ప్రసంగం ముఖ్యాంశాలు "ప్రభుత్వం పేదల దగ్గరున్న భూములను లాక్కొనేలా కొత్తగా అసైన్డ్ మెంట్ యాక్ట్ కి సవరణలు చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అసైన్డ్ మెంట్ యాక్ట్ కింద ఎక్కువగా ఎస్సీలు, బీసీలే భూములు సాగుచేసుకుంటున్నారు. వారి స్వాథీనంలోఉన్నభూములను ఎవరైనా బలవంతంగా లాక్కున్నా, తిరిగి వారికే స్వాధీనపరిచి, సదరు భూములపై వారికే హక్కు కల్పించేలా గతంలోనే చట్టాలు చేశారు.అటువంటి చట్టానికి తూట్లు పొడిచేపరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఎస్సీల భూములను, ఆదాయంకోసం ఎవరైనా వినియోగిస్తారని నీచంగా మాట్లాడుతున్నారు. అది చాలా దుర్మార్గం. ఒకవేళ అలాజరిగితే చట్టాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఎస్సీలకు న్యాయం చేయాలనుకుంటే, చట్టం లేకపోయినా వారిభూములు వారికి ఇవ్వొచ్చుగా.అదే సమయంలో ఎక్కువలాభం వస్తుందని చెబుతున్నారు. లాభం కోసమే అయితే పేదలస్వాధీనంలోని భూములెందుకు ఇవ్వడం.. మీ సొంత భూములే ఇవ్వొచ్చుగా? మీరే మీ భూములిచ్చి, ఆలాభాలు మీరే పొందండి. పేదలు, మరీ ముఖ్యంగా ఎస్సీల పొట్టకొట్టడమేంటి? కోర్టులు మొన్ననే చాలా సీరియస్ గా చెప్పాయి. పేదల భూములు ఒకరి దగ్గర తీసుకొని మరొకరికి ఇస్తానంటారా... ఇదెక్కడి న్యాయం.. అసైన్డ్ మెంట్ భూములు లాక్కోవడం చాలా తప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది. కోర్టులు చీవాట్లు పెట్టినా వీళ్లకు బుద్ధిరాలేదు. ఈ రోజు వీళ్లు చేస్తున్న పనులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. బాధ్యతలేని, ప్రజాస్వామ్యంపై గౌరవం లేని స్పీకర్ కనీసం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, అవతలి వైపున 10మందికి అవకాశమిచ్చి, వారితో నన్ను తిట్టిస్తారా?"

" మాపార్టీని విమర్శిస్తారు.. మాట్లాడదామంటే కనీసం మైక్ కూడా ఇవ్వరు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే స్థితికి దిగజారారు. రాష్ట్రంపై పెనుభారం వేయబోతున్నారు. 10వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్పి చేస్తున్నామనిచెబుతున్నారు. ఒకపక్క రాష్ట్రంలో ఇప్పటికే 19,500మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. కొత్తగా అగ్రిమెంట్లు జరిగాయి. ఆ విద్యుత్తే సరిపోతుంది. వీళ్లు కావాలనే అవినీతికోసం అదనంగా ఉత్పత్తి అంటూ వ్యవస్థను కుప్పకూల్చే ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రజలపై పెనుభారం వేసేపరిస్థితికి వచ్చారు. పీపీఏలపై విమర్శలు చేసిన పెద్దమనుషులు, విపరీతంగా ఎక్కడాలేని విధంగా ఇన్సెంటివ్ లు ఇచ్చారు. ఆ ఇన్సెంటివ్ లు ఇచ్చినవిధానం కూడా చాలా దారుణం. వీటన్నింటిపై మేము చర్చ జరగాలంటున్నాం. మీకు మీరు కావాలని బలవంతంగా అవినీతికోసం మరో 10వేల మెగావాట్లు తేవచ్చు. కానీ ప్రజలు మిమ్మల్ని ఛీకొట్టే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో మీకు తగినగుణపాఠం చెప్పే వస్తుందని, ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నా." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read