ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తీసుకుంటున్న ఒంటెద్దు పోకడలతో, రాజ్యాంగ సంస్థలకు, ప్రభుత్వానికి మధ్య రోజు రోజుకీ గ్యాప్ ఎక్కువ పెరిగిపోతుంది. శాసనమండలి పై కానీ, కోర్టు ల పై కానీ, ఎన్నికల కమిషన్ పై కానీ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు, చాలా అభ్యంతరకరంగా మారుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య వైరం రచ్చకు ఎక్కింది. ఇది ఇప్పటికే కోర్టుల వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టులో, ఇదే విషయం పై రాష్ట్ర ప్రభుత్వానికి మూడు సార్లు ఎదురు దెబ్బ తగిలింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రావటం లేదు. హైకోర్టు మాట వినటం లేదు, సుప్రీం కోర్టు చెప్పినా అదే తీరు కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ పై, రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కోరటం, రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలతో కలిసి, వారి అభిప్రాయం తీసుకుని, మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపటం, అదే విధంగా వివిధ రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షలు చేయటం, అన్నీ క్రోడీకరించి, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రొసీడింగ్స్ ఇచ్చి, హైకోర్టుకు తెలపటం జరిగింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు ఒప్పుకోవటం లేదు. ఇక మరో పక్క, అన్ని జిల్లాల కలెక్టర్లతో సంప్రదించాలి, వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవాలి అని చెప్పినా, ప్రభుత్వం వైపు నుంచి అనుమతి ఇవ్వటం లేదు.
ఇక అలాగే మంత్రి కొడాలి నాని, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ పై, వాడు వీడు అంటూ కామెంట్స్ చేయటంతో, ఈ విషయం పై ఇప్పటికే గవర్నర్ కు ఫిర్యాదు చేసారు, ఎన్నికల కమీషనర్. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, ప్రభుత్వం హైకోర్టులో ఎన్నికలు జరపటానికి వీలు లేదని అఫిడవిట్ వేసింది. అయితే హైకోర్టులో ఉండగానే, ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో చేసిన తీర్మానంతో అందరూ అవాక్కయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణ పై కుదరదు అంటూ నిన్న ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీని పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సీరియస్ అయ్యారు. గవర్నర్ విశ్వభూషణ్‌కు ఈ విషయం పై ఫిర్యాదు చేసారు. ప్రభుత్వం చేసిన తీర్మానం రాజ్యంగ విరుద్ధం అని, ఆర్టికల్ 243కే ప్రకారం, ఎన్నికల కమీషన్ అధికారాలు ఎవరూ తీసేయలేరని, ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేయటం, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అని పేర్కొన్నారు. ఆ ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలని పేర్కొనారు. ఈ విషయం పై సుప్రీం కోర్టు న్యాయనిపుణులను అభిప్రాయం కూడా తీసుకుని, ఇలాంటి వాటిని తిరస్కరించాలని నిమ్మగడ్డ , గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తెసుకుంటారో చూడాలి.