ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం కాదు, ప్రపంచం అంతా చూస్తుంది. ఆంధ్రర్పదేశ్ రాష్ట్రంలో వచ్చిన వింత వ్యాధి దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో, 5 రోజులు క్రితం ప్రజలు వింత వ్యాధి బారిన పడిన, హాస్పిటల్ పాలు అయిన సంగతి తెలిసిందే. మూర్చతో పడిపోయి, నురగ కక్కుకుంటూ, ప్రజలు హాస్పిటల్ పాలు అయ్యారు. ఈ రోజుకి పరిస్థితి కొంచెం కుదుట పడింది. ఇప్పటి వరకు దాదాపుగా 600 మంది ఈ వ్యాధి బారిన పడగా, ముగ్గురు చనిపోయారు. అయితే ఇన్ని రోజులు అయినా ప్రభుత్వం, దీనికి గల కారణాలు చెప్పలేక పోయింది. మంచినీరు కారణంగానే ఇంత మంది జబ్బు బారిన పడి ఉంటారని చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం నీటిలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన బృందాలు మాత్రం, నీటిలో సీసంతో పాటుగా, క్లోరిన్ అధికం అవ్వటం వలన, నీరు కలుషితం అయి ఉంటుందని ఇప్పుడిప్పుడే ఒక నిర్ధారణకు వస్తున్నారు. దీని పై ఈ రోజు, రేపటిలోగా, కేంద్ర బృందం తమ పరిశీలనలో అంశాలు చెప్పనుంది. అయితే ప్రాధమికంగా అందరూ నీరు కలుషితం పైనే ద్రుష్టి పెట్టారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలల్లో పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మాజీ ఐఏఎస్ అధికారి రాసిన లేఖ, ఇప్పుడు సంచలనంగా మారింది.
మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. ఆ లేఖలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. ఏలూరు పరిస్థితి, విశాఖకు రాక ముందే మేల్కోవాలని హెచ్చరించారు. ఏలూరులో నీరు కలుషితం అయ్యి, సీసం కలిసిందని చెప్పినట్టే, విశాఖ నీటిలో కూడా సీసం కలిసిన ఆనవాళ్లు ఉన్నాయని మాజీ అధికారి ఈఏఎస్ శర్మ తెలిపారు. విశాఖపట్నం నగరంలో నీటి కాలుష్యం అధికంగా ఉందని, ఇక్కడ నీరు కూడా కలుషితం అవుతుందని, జాగ్రత్త పడాలని లేఖలో తెలిపారు. దీనికి సంబంధించి కొన్ని నివేదికలు కూడా ఆయన జత చేసారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నివేదిక కూడా ఇదే చెప్తుందని అన్నారు. విశాఖతో పాటుగా ఇతర నగరాలకు కూడా ఈ సమస్య ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా పైపులైన్ల వ్యవస్థ, వాటికి ఉపయోగించే మెటీరియల్ కూడా ఈ కాలుష్యానికి కారణం అవుతున్నాయని అన్నారు. దీని పై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. మరి శర్మ గారు రాసిన లేఖ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందించి, ఇలనాటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూస్తుందో చూడాలి.