పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి జీవనాడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో, మనకు ఏదైనా వచ్చిన మంచి ఏదైనా ఉంది అంటే, అది పోలవరం ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించటం. 2014 వరకు 3 శాతం పనులు అయితే, చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు ఆ పనులను 72 శాతానికి తీసుకుని వెళ్లారు. గత 18 నెలలుగా గట్టిగా 2 శాతం పని కూడా జరగలేదు. ఇది ఇలా ఉంటే చంద్రబాబు హయాంలోనే, పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను కేంద్రం రూ.55,548.87 కోట్ల అంచనాకు ఆమోదించింది. కేంద్ర జలశక్తి శాఖలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, సిడబ్ల్యుసీ అప్పట్లోనే ఈ అంచనాలు ఆమోదించాయి. అయితే తరువాత ప్రభుత్వం మారటంతో, కేంద్రం పోలవరం విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు హయాంలో ఆమోదించిన రూ.55,548.87 కోట్లు కాకుండా, కేవలం రూ.20 వేల కోట్లు ఇస్తే సరిపోతుందని, రాష్ట్రానికి ఒక లేఖ రాసింది. దీని పై కేంద్రంతో పోరాడి, మోడీ మెడలు విరిచి, పోలవరం అంచనాలు రూ.55,548.87 కోట్లకు ఆమోదించుకుని రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, తమ చేతకాని తనాన్ని చంద్రబాబు మీద రుద్దే ప్రయత్నం చేసింది. గతంలో చంద్రబాబు ప్యాకేజికి ఒప్పుకోవటంతోనే, కేవలం 2013-14 రేట్లు ప్రకరామే కేంద్రం ఇస్తాను అంటుందని, అప్పట్లో క్యాబినెట్ సమావేశంలో కూడా ఇదే ఒప్పుకున్నారు అంటూ, ఇదంతా చంద్రబాబు తప్పు అంటూ చెప్పుకొచ్చింది వైసిపీ.
అయితే 2019లో ఆమోదించారు కదా , ఎప్పుడో 2017లోది ఎందుకు ? 2019 ఆమోదించిన దాని గురించి చెప్పండి అంటే మాత్రం, మాట్లాడటం లేదు. ఇలా తమ చేతకాని తనాన్ని, చంద్రబాబు మీద వేసే ప్రయత్నం చేసింది వైసీపీ. అయితే అబద్ధం ఏనాటికైనా బయట పడుతుంది కాబట్టి, ఈ రోజు అదే బయట పడింది. కేంద్ర జల శక్తి శాఖ ఇచ్చిన 2020 నివేదికలో, పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం 2017-18నాటి ధరల ప్రకారం, రూ.55,548.87 కోట్లుగా గుర్తించింది. అంటే చంద్రబాబు హయాంలో ఆమోదించిన దానికే కేంద్రం ఒప్పుకుంది. అలాగే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ కోసం పెట్టిన ఖర్చు రూ.17,327 కోట్లుగా కేంద్రం తేల్చింది. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మేల్కొనాలి. ఇది కేంద్ర ప్రభుత్వం మనకు ఇచ్చిన ఒక పెద్ద ఆయుధం. ఇది చూపించి, మీరు లేఖ రాసినట్టు రూ.20,398.61 కోట్లు కాదు, మాకు రూ.55,548.87 కోట్లు ఇవ్వాల్సిందే అని వెంటనే జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయాలి. కేంద్రాన్ని ఇదే సమయంలో ఫిక్స్ చేయాలి. చంద్రబాబుని ఎప్పుడైనా సాధించవచ్చు కానీ, కేంద్రం ఇచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం, రాష్ట్ర ప్రభుత్వం వదులుకోకూడదు. చూద్దాం, ప్రభుత్వం ఏమి చేస్తుందో.