ప్రతి రోజు మీడియా ముందు కనపడి, రాజధాని రచ్చబండ పేరుతో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు, ప్రభుత్వం తీరు పై , వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో అభిప్రాయలు చెప్పే వారు. అయితే ఈ మధ్య ఆయన సైలెంట్ అయ్యారని అందరూ అనుకున్నారు. నిజానికి ఎంపీ రఘురామకృష్ణరాజుకి హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆయనకు జరిగిన వైద్య పరీక్షల్లో, స్వల్ప తేడా గమనించి, గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుని, ఇప్పుడిప్పుడే మళ్ళీ తనదైన శైలిలో సమస్యల పై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణం రాజు, తన ఆపరేషన్ అయిన తరువాత చేసిన మొదటి పని, అమరావతి రైతులు తరుపున నిలబడటం. మూడు ముక్కలు చేసి, అమరావతి రైతులకు గుండె కోత మిగిల్చిన ప్రభుత్వ తీరును ఆయన వ్యతిరేకించారు. అయితే ఈ క్రమంలో రాజధాని రైతులు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల చీఫ్ జస్టిస్ లను మార్చుతూ, కొలీజియం సూచనలు చేసింది. ఈ లిస్టు లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ మహేశ్వరీ కూడా ఉన్నారు. అయితే ఆయన కీలకమైన అమరావతి కేసు కూడా వాదిస్తున్నారు.
రెండు నెలల క్రితం నుంచి అమరావతి కేసు రోజు వారీ విచారణ కూడా జరుగుతుంది. మరో నెల రోజుల్లో సంక్రాంతి పండుగ అయిన తరువాత, ఈ కేసు పై హైకోర్టు ఒక తీర్పు ఇస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో, ఆయన బదిలీ వార్తలు వచ్చాయి. మళ్ళీ కొత్త చీఫ్ జస్టిస్ వస్తే, కేసు మళ్ళీ మొదటి నుంచి వినాల్సి వస్తుంది. దీనిపైనే ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రపతికి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి ఒక లేఖ రాసారు. అమరావతి కేసు తీర్పు వచ్చే వరకు మహేశ్వరీ గారినే చీఫ్ జస్టిస్ గా ఉంచాలని కోరారు. ఇది రైతులతో ముడిపడిన అంశం అని, ఇప్పటికే అనేక మంది మనోవేదనతో చనిపోయారని, మళ్ళీ ఇప్పుడు చీఫ్ జస్టిస్ మారిపోయి, కేసు మళ్ళీ మొదటి నుంచి రావాలి అంటే జాప్యం జరుగుతుందని, దీన్ని నివారించేందుకు ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఈ కేసు విచారణ అయ్యి, తీర్పు ఇచ్చేంత వరకు ఉంచాలని కోరారు. కొత్తగా వచ్చే చీఫ్ జస్టిస్ పై పూర్తి నమ్మకం ఉందని, మళ్ళీ ఈ కేసు మొదటి నుంచి మొదలు పెడితే, తీవ్ర జాప్యం జరిగి, ఇక్కడ ఉన్న 29 వేల కుటుంబాలు మరింత ఆవేదనకు లోనవుతారని, అందుకే ఈ లేఖ రాస్తున్నట్టు, రాష్ట్రపతిని, చీఫ్ చీఫ్ జస్టిస్ ని కోరారు.