వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, అణిచివేత విచ్చలవిడిగా మారడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారింది. పోలీసులలో కొందరు నేరాల రేటు తగ్గించి శాంతిభద్రతలు కాపాడటానికి బదులుగా, ప్రజల ప్రాధమిక హక్కులను అణిచేయడంపైనే శ్రద్ద చూపడం విడ్డూరం. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వమే అసమ్మతిని అణిచేయడం హాస్యాస్పదం. ప్రతిపక్షాల గొంతు నొక్కేయడంలో పోలీసుల్లో కొందరు అధికార వైసిపితో కుమ్మక్కు కావడం విచారకరం. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలు ఏడాది పూర్తయిన సందర్భంగా 17డిసెంబర్ 2020న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పోలీస్ నోటీసులు జారీ చేయడమే అందుకు తార్కాణం. బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కారాదని, ఏ కార్యక్రమంలో పాల్గొనరాదని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే ఈ నోటీసులు..17డిసెంబర్ 2020న పోలీసులు జారీచేసిన ఈ నోటీసులు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ), 19(1)(బి) మరియు 19(1)(డి) స్ఫూర్తిని కాలరాయడమే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 600మంది టిడిపి నాయకులకు ఈ నోటీసులను ఇచ్చారు, ఎటువంటి అసమ్మతిని తెలియజేయరాదని హెచ్చరించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తమ అసమ్మతిని తెలియజేసి శాంతియుత ఆందోళనల ద్వారా మన స్వాతంత్ర్య యోధులు మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించారనేది ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా వెలిబుచ్చే అసమ్మతిని అణిచేయడానికి బదులుగా శాంతిభద్రతల పరిరక్షణపై మీరు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగ హామీగా సంక్రమించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ బాధ్యత మీ రాజ్యాంగ విధి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read