ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చారు. పోలవరం విషయంలో జరుగుతున్న రచ్చ పై ఆయన సవివరగంగా మాట్లాడారు. 11 ఫిబ్రవరి 2019లో టీఏసీ 141వ సమావేశంలో 2017-18 అంచనాల ప్రకారం రూ.55, 548.87 కోట్లుగా ఆమోదించారని చంద్రబాబు గుర్తు చేసారు. అలాగే 20 ఫిబ్రవరి 2014న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడుతూ ‘‘2013 భూసేకరణ చట్టం తీసుకువచ్చామని, దీని ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెరిగిందని, వీటన్నింటికి మేమే ఇస్తామని’’ చాలా స్పష్టంగా చెప్పారని చంద్రబాబు గుర్తు చేసారు. 27 మే 2014న ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినేట్ లో 7 ముంపు మండలాలను విలీనం చేస్తూ 2014 కంటే ముందు పోలవరంపై పెట్టిన ఖర్చును రాష్ట్ర వాటాగా తీసుకొని మిగిలిన డబ్బులు ఇస్తామని చెప్పారని, జాతీయ ప్రాజెక్టుల నిర్మాణ పనులు సంతృప్తి స్థాయిలో జరగడం లేదని నీతి ఆయోగ్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అప్పగించారని, దానికి సంబందించిన వివరాలు బయట పెట్టారు. 15 మార్చి 2017లో జరిగిన కేంద్ర క్యాబినేట్ లో ఆనాటి ఇరిగేషన్ కాంపోనెంట్ 100% పూర్తిగా భరిస్తామని చెప్పారని గుర్తు చేసారు. ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే హెడ్ వర్క్స్ , కెనాల్స్ తవ్వకం, ఆర్ ఆండ్ అర్ అన్నీ కలిపే ఉంటుంది...21ఏప్రిల్ 2020లో రమేష్ చంద్ర అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు జవాబుగా ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే లాండ్ ఎక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ కూడా కలిపే వస్తందని చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయకుండా ఇష్టారాజ్యంగా టిడిపిపై బురద జల్లడం హేయం అని చంద్రబాబు మండి పడ్డారు. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్యుసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటి(పీపీఏ), కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ టెక్నికల్ అడ్వయిజరీ కమిటి(టీఏసీ) అడిగినప్పుడల్లా ఢిల్లీకి లక్షలాది డాక్యుమెంట్లు పంపామని, కేంద్రానికి కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించామని, పోలవరం అంచనాలపై కేంద్రం ఆమోదం వచ్చేవరకు అక్కడ నుంచి రావొద్దని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించామని, చివరకు ఫిబ్రవరి 2019లో కేంద్ర జలవనరుల శాఖ టీఏసీ రూ.55,548 కోట్ల అంచనాలకు ఆమోదం తెలిపారని అన్నారు. వైసీపీ నాయకులు అవగాహన లేకుండా, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో పోలవరం పనుల్లో అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పింది. అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులే చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలు, మీడియా, మేధావులకు చురకలు అంటించారు. "మేం 70శాతం పనులు పూర్తి చేశాం.. 30శాతమే పూర్తిచేశారని వైసీపీ దుష్ప్రచారం చేస్తే, దానిని కూడా మీడియా ఖండించలేకపోవడం బాధాకరం. ప్రజలనుంచి బాధ్యత తీసుకున్న వైసిపిని అడగకుండా టిడిపిని అడుగుతున్నారు. ఏడాదిన్నరలో వైసీపీ రూపాయి పనికూడా చేయలేదు. మేధావులు దాన్ని ప్రశ్నించకుండా, టీడీపీపై నిందలు వేస్తున్నారు, ఇది సరికాదు. మాకేమి సంబంధం లేదు, మొత్తం చంద్రబాబు చేయాలి అంటే ఎలా. ప్రజల పట్ల మా బాధ్యత మేం నెరవేరుస్తాం. ప్రజలు కూడా కలిసి రావాలి. మేధావులు మాట్లాడాలి. మీడియా ప్రశ్నించాలీ" అని చంద్రబాబు అన్నారు.