అక్రమ కేసులు ఎందుకు పెట్టారు, రైతులకు ఎందుకు బేడీలు వేసారు అని ప్రశ్నించి ఆందోళన కార్యక్రమాలు చేసి, జైల్ భరో కార్యక్రమంలో పాల్గున్న వారికి, షాక్ ఇచ్చారు పోలీసులు. రైతులకు బేడీలు వేసిన సంఘటనకు నిరసనగా, గుంటూరు జైల్లో ఉన్న రైతులకు సంఘీభావంగా, అమరావతి రైతులు ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. శనివారం రోజున చలో గుంటూరు జైలు కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. అయితే ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ముందు రోజు రాత్రి నుంచే చాలా మంది పై స్థాయి నాయకులను హౌస్ అరెస్ట్ చేసారు. రకరకాల నిర్బంధాలు చేసారు. అయినా సరే, పోలీసులు ఆంక్షలు దాటుకుని, అమరావతి రైతులు, మహిళలు, జేఏసి నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, జైలు భరో కార్యక్రమం కోసం గుంటూరు వెళ్లారు. అక్కడ జైలుకు కూత వేటు దూరంలో వారిని ఆపేయటంతో పోలీసులు, రైతులు, మహిళలు మధ్య గొడవ జరిగింది. పెద్ద ఎత్తున రైతులు, మహిళలు చేరుకోవటంతో, వారిని కంట్రోల్ చేసే క్రమంలో, పోలీసులు కొంచెం దూకుడుగా వెళ్లారు. లాగి పడేయటం, ఎత్తి వ్యాన్ లో పడేయటం, ఇలాంటి ఘటనలతో, కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తానికి పోలీసులు మధ్యానానికి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అయితే ఇప్పుడు ఆ రోజు ఆందోళనలో పాల్గున్న వారికి, షాక్ ఇచ్చారు పోలీసులు.
తాము అనుమతి లేదు అని చెప్పినా, కార్యక్రమంలో పాల్గున్న వారి పై నాన్ - బెయిలబుల్ కేసులు పెట్టారు. శనివారం రోజున ఆందోళనలో పాల్గున్న దాదాపు 122 మంది పై నాన్ - బెయిలబుల్ కేసులు నమోదు చేసారు. కో-వి-డ్ గైడ్ లైన్స్ అతిక్రమించారని, అలాగే 144 అమలులో ఉన్నా, ఆ సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించారని, అమరావతి ఉద్యమంలో పాల్గున్న 122 మంది పై కేసులు పెట్టారు. గుంటూరులోని అరండల్‌పేట స్టేషన్‌లో, ఈ కేసులను నమోదు చేసారు పోలీసులు. కేసులు పెట్టిన వారిలో అమరావతి జేఏసి నాయకులు, వివిధ పార్టీల నేతలు కూడా ఉన్నారు. అమరావతి మహిళా జేఏసి నేత రాయపాటి శైలజ, అమరావతి దళిత జేఏసి నేత మార్టిన్ లూధర్, ఇలా 122 మంది పై కేసులు పెట్టారు. ఐపిసి 341, 186, 188, 269 సెక్షన్ల కింద, వీరి అందరి పై, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. 122 మందిలో, 23 మందిపై 151 సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది. రాయపాటి శైలజను ఏ1గా చేర్చటం గమనించాల్సిన విషయం. మేము పోరాడుతుంటే అక్రమ కేసులు పైన అయితే, మళ్ళీ మా మీదే కేసు పెట్టారని, కేసులు ఎదుర్కుంటామని, అమరావతిని సాధిస్తామని రైతులు అంటున్నారు.