గత తెలుగుదేశం ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ, చంద్రబాబు చెవిలో ఎప్పుడూ ఏదో ఒక గోల పెడుతూ విసిగిస్తూ ఉండేది. యూసిలు అని, లెక్కలు అని, మా పేరు లేదని, ఇదని, అదని అనేక రకాలుగా, ఏదో ఒక విషయం పై ప్రతి రోజు రచ్చ జరిగేది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత సైలెంట్ అయిపోయారు. గతంలో చంద్రన్న భీమా, అన్నదాత సుఖీభవ లాంటి పధకాల పై తమ పేరు లేదని, ఇందులో కేంద్రం వాటా కూడా ఉందని ఆందోళన చేసే వారు. అయితే ఇప్పటి జగన్ ప్రభుత్వంలో మాత్రం సైలెంట్ గా ఉండటం విశేషం. ఈ రోజు రైతు భరోసా కార్యక్రమం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండో విడత నిధులు విడుదల చేస్తూ, ఒక ఫుల్ పేజి ప్రకటన అన్ని పేపర్లలో ఇచ్చింది. అయితే ఇందులో ఎక్కడా ప్రధాని పేరు లేదు. గత ఏడాది ప్రకటనలో మాత్రం, పీఎం కిసాన్ అని పేరు రాసారు. ఈ సారి మాత్రం ప్రధాని పేరు ఎత్తేసి, బీజేపీకి షాక్ ఇచ్చారు జగన్. ఈ రైతు భరోసాలో, కేంద్రం ఆరు వేలు ఇస్తుంటే, జగన్ ప్రభుత్వం ఏడు వేల 500 ఇస్తుంది, అంటే దాదాపుగా 40 శాతం కేంద్రం నుంచే వస్తాయి. అయితే ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా కేంద్రం పేరు, ప్రధాని పేరు లేకపోవటం ఆశ్చర్యం. అయితే ఈ చర్యను బీజేపీ అసలు పట్టించుకోక పోవటం మరొక ఆశ్చర్యం. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ నేతలు, వైసీపీకి అనుకూలం అనే అభిప్రాయం ఉంటే, ఇలాంటి చర్యలతో అది మరింత బలపడే అవకాసం ఉన్నా, బీజేపీ నేతలు మాత్రం ఎందుకో కానీ ఈ విషయం పై అసలు పట్టించుకోలేదు. అయితే ఈ పధకంలో ఉన్న అవకతవకల పై ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్పందించింది. రైతు పక్షపాతి అనేపదానికి ఏకైక అర్హుడిని ఈ ప్రపంచంలో తానేనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, తనకు తానే స్వీయ ధృవీకరణలు ఇచ్చుకోవడం, సొంతడబ్బాలు కొట్టుకోవడం ఆయనలా మరే ముఖ్యమంత్రి చేయడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! " వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద వరుసగా రెండోఏడాదికూడా రాష్ట్రంలో 50.47లక్షల రైతుకుటుంబాలకు పెట్టుబడి సాయంగా రూ.6,797కోట్లు ఇచ్చినట్లు పత్రికలకు ఆర్భాటంగా ప్రకటనలిచ్చారు. నేడు ఆసొమ్ము మొత్తం రైతుల ఖాతాల్లో పడుతున్నట్లు ప్రకటనల్లో చెప్పారు. రైతుభరోసా పథకమే పెద్ద రైతుదగా పథకం. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇస్తానని, కేంద్రం సాయంతో సంబంధంలేకుండా ఏటా తానే చెల్లిస్తానని ప్రతిపక్షంలోఉన్నప్పుడు జగన్ చెప్పారు. ఇప్పుడేమో కేంద్రంఇచ్చే సొమ్ముతో కలిపి రూ.12,500 ఇస్తానని చెబుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి రూ.18,500 ఇస్తానని చెప్పాడు. దానిపై రైతులంతా గొడవచేయడంతో ఏదో కంటితుడుపుచర్యగా రాష్ట్రం ఇచ్చే రూ.6,500లకు అదనంగా మరో వెయ్యి పెంచారు. రూ.1000 పెంచినా మరో 5వేలు ప్రతిరైతుకు కోతపెట్టారు. జగన్ ప్రభుత్వంలో రైతులకు చేసే సాయానికి సంబంధించిన రాతలేమో మిన్నగా సాయమేమో సన్నగా ఉంది. సరిగ్గా ఏడాదిక్రితం అక్టోబర్ 15, 2019న సాక్షిపత్రికలో రైతుభరోసా కింద ఇచ్చిన ప్రకటనలో, మొత్తం లబ్దిదారుల సంఖ్య 54లక్షల మందికి వర్తింపచేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రైతుభరోసా పథకానికి సంబంధించి ఇచ్చిన ప్రకటనలో 50.47లక్షలలకు లబ్ధిదారుల సంఖ్యలో మూడున్నర లక్షలమందికి కుదించారు. ఒక్క ఏడాదిలోనే మూడున్నర లక్షలమంది రైతులు ఏమయ్యారో తెలియదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో రైతుభరోసా గురించి మాట్లాడుతూ, 64.06వేల మంది రైతులకు వైఎస్సార్ రైతుభరోసా వర్తింపచేస్తామని చెప్పారు. 64 లక్షలమంది రైతులు 2019 అక్టోబర్ నాటికి 54లక్షల మంది ఎలా అయ్యారో, తిరిగి ఈ ఏడాది అక్టోబర్ నాటికి 50.47లక్షలమందికి ఎలా తగ్గిందో చెప్పాలి. "
"2019 అక్టోబర్ లో రైతుభరోసా పథకం కింద మొత్తం లబ్దిదారుల సంఖ్య కేవలం 46లక్షల69వేల,375 మంది మాత్రమే అని సాక్షి పత్రికలో నేడు (27-10-2020) రాశారు. 2020 ఖరీఫ్ సమయానికి లబ్దిదారలు సంఖ్యను 49 లక్షల 57వేలకు పెంచామని, ఇప్పుడు రబీ సమయానికి ఏకంగా 50లక్షల 47వేలకు పెంచామని తప్పుడురాతలు రాశారు. సాక్షిపత్రికలో వేసిన ప్రకటనలో లబ్ధిదారుల సంఖ్య 54లక్షలని చెప్పి, 2019 అక్టోబర్ నాటికి అదేసాక్షిలో 46లక్షల69వేల 375 మంది అని ఎలా చెప్పారు? ప్రజలుఏదినమ్మాలి? రైతుభరోసా పథకాన్ని 54లక్షలమందికి ఇస్తామనిచెప్పి, 8లక్షలమందికి కోతపెట్టేసి, చివరకు 46లక్షల69వేలమందికే ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి తన సాక్షి పత్రికలో రాసిన వాటిపై ఏం సమాధానం చెబుతారు? ఈ విధంగా ప్రకటనలపేరుతో ఒకలా, రాతల్లో మరోలా ఎలా తప్పుడు రాతలు, కాకిలెక్కలు చెబుతున్నారో ప్రజలంతా అర్థంచేసుకోవాలి. వచ్చే ఏడాది లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గొచ్చు. 2019 అక్టోబర్ లో రైతుభరోసా పథకాన్ని 46లక్షల69వేలమందికే జగన్మోహన్ రెడ్డి అమలుచేశారా? లేదంటే సాక్షిపత్రిక ప్రకటనలో చెప్పినట్టు 54లక్షలమందికి అమలుచేశారా? ఏది వాస్తవమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. తెలుగుప్రజల మనస్సాక్షి పేరుతో ప్రజలకు ఎన్ని రకాలుగా తప్పుడు రాతలు రాస్తున్నారో, రాష్ట్ర రైతులను ఎలా మోసగిస్తున్నారో అందరూ అర్థంచేసుకోవాలి. " అని పట్టాభి అన్నారు.