అమరావతి ఉద్యమకారులు ఏదైనా పిలుపు ఇస్తే చాలు, ప్రభుత్వం ఎందుకో కానీ భయపడుతున్నట్టు కనిపిస్తుంది. ఏ నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా, దాన్ని అణిచివేస్తూ వస్తుంది. 319 రోజుల్లో ఎన్నో నిర్బంధాలు చేసినా, రైతులు మాత్రం శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా, అమరావతి రైతులకు సంకెళ్ళు వేసిన సంఘటన, రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దళితుల పైనే, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టటం సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో మూడు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు చలో గుంటూరు జైలు కార్యక్రమానికి అమరావతి జేఏసి పిలుపు ఇచ్చింది. గుంటూరు జైలులోనే, అరెస్ట్ చేసిన అమరావతి రైతులు ఉన్నారు. అందుకే ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించటంతో, జగన్ సర్కార్ అలెర్ట్ అయ్యింది. కేవలం అమరావతి నుంచే కాదు, అటు శ్రీకాకుళం నుంచి, రాయలసీమ వరకు, నేతలు ఈ కార్యక్రమానికి వస్తున్నారనే సమాచారం రావటంతో, నిన్న రాత్రి నుంచే నేతలను హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. దీంతో మరోసారి అమరావతి ఉద్యమం , జగన్ సర్కార్ ను తాకినట్టు అయ్యింది. వారి సమస్యలు ఏమిటో పట్టించుకోకుండా, వారి పై నిర్బంధాలు చేస్తూనే ఉన్నారు. అమరావతి ఉద్యమంలో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నా రైతులను పోలీసులు అరెస్టు చేసి బేడీలు వేసి కోర్టుకు హాజరు పరిచిన నేపథ్యంలో అన్నదాతకు బేడీలు వేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గుంటూరు జైలు భరో కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశించింది. అలాగే అన్ని పార్టీల నేతలు పిలుపు ఇచ్చారు.
ఈ సందర్భంగా అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేయటానికి జైలు భరో కార్యక్రమానికి బయలుదేరిన నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ఈ అరెస్ట్ ల పై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. "ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలన ఏ విధంగా కొనసాగుతుందో చెప్పడానికి.... అందుకు నిదర్శనమే ఈ యొక్క అమరావతి రాజధాని రైతులకు చేసిన అన్యాయం అంతేకాకుండా అక్కడ ఉన్న రైతులకు బేడీలు వేసి మరీ జైలుకు తరలించడంలోనే తెలుస్తుంది. ఇటువంటి ప్రభుత్వాలా మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి అని సిగ్గేస్తుంది. ఈ దేశానికి వెన్నెముక రైతన్న అటువంటి రైతు చేతికే ఈరోజు బేడీలు వేసి జైలుకు తీసుకు వెళ్లారు అంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాము మీరు ఇటువంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని తలంపులు తెచ్చినా అమరావతి రాజధానికి మా యొక్క మద్దతు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అక్కడ ఉన్న రైతులు అందరికీ కూడా అండగా ఉండి వారికి న్యాయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేశారు. ప్రజలందరూ కూడా మీ యొక్క పరిపాలనను గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఈప్రభుత్వం భయపడుతుందనడానికి ఈ అక్రమ అరెస్టే కారణం అన్నారు. ఇటువంటి అరెస్టులు, కేసులు ఎన్ని పెట్టినా ఏమి చేసినా ఎవరూ భయపడేవారు లేరని న్యాయం జరుగుతుందంటే ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధమేనని ఎటువంటి పోరాటం అయినా చేస్తామని తెలియజేశారు.