ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్ర పరిస్థితితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ, తాము చేసేది తప్పు అని ఎవరు చెప్పినా, వారి పై ఏదో ఒక విధంగా పరువు తీసే పనులు చేస్తున్నారు. తప్పు ఎక్కడ జరిగింది, ఏది సరి చేసుకోవాలి అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తమకు ఎవరు అడ్డు చెప్పినా, వారి విమర్శలను పోజిటివ్ గా తీసుకోకుండా, నెగటివ్ గా తీసుకుంటున్నారు. చివరకు రాజ్యాంగ సంస్థలను కూడా వదిలి పెట్టటం లేదు. ఎన్నికల కమీషనర్ అయినా, శాసనమండలి చైర్మెన్ అయినా, చివరకు హైకోర్టు జస్టిస్ లు అయినా, ఇలాగే వ్యవహరిస్తున్నారు. కోర్టుల్లో తీర్పులు చెప్పే జడ్జిలను కూడా, పలానా కేసు నుంచి తప్పించాలని ఏకంగా ప్రభుత్వం పిటీషన్ వేసే పరిస్థితి వచ్చింది. మిషన్ బిల్డ్ ఏపి కేసులో, జస్టిస్ రాకేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన్ను విచారణ నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ వేసింది. అలాగే రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందో లేదో తేల్చాలి అని చెప్పే కేసులో కూడా జస్టిస్ రాకేశ్ కుమార్ ని విచారణ నుంచి తప్పించాలని కోరారు. దీంతో రాకేశ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను 29 ఏళ్ళ ప్రాక్టీస్ తరువాత, 2009లో హైకోర్ట్ జడ్జి అయ్యాను అని, అప్పటి నుంచి ఏ రిమార్క్ లేకుండా పని చేసానని, రిటైర్ అయ్యే వరకు ఇలాగే పని చేస్తానని అన్నారు. కెరీర్ చివరి దశలో ఇలాంటి పిటీషన్ లు తన పై వస్తాయని అనుకోలేదని అన్నారు.
అయితే ఇదే సమయంలో జస్టిస్ రాకేశ్ కుమార్ ముందుకు మరో కేసు వచ్చింది. అదే ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు కేసు. గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కనిపించిన ప్రతి భవనానికి తమ పార్టీ రంగులు వేసేసారు. ఆ తరువాత ఈ విషయం కోర్టుకు వెళ్ళటంతో, మరో రంగు జోడించి, మార్చేసాం అని చెప్పారు. అయితే మళ్ళీ కోర్టు అక్షింతలు వేయటంతో, మొత్తానికి సున్నం పూసి, వేరే రంగులు వేసారు. ఇలా పార్టీ రంగులు వేయటం, మళ్ళీ వేరే రంగు వేయటం, మళ్ళీ సున్నం పూసి వేరే రంగులు వేయటం, ఇలా ఈ మొత్తం ఖర్చు 4 వేల కోట్ల వరకు అయ్యిందని, ఈ మొత్తం ఖర్చు అంతా సంబధిత అధికారులు నుంచి రాబట్టాలి అంటూ హైకోర్టులో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు జస్టిస్ రాకేశ్ కుమార్ ముందుకు రాగా, ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తన పై మరో పిటీషన్ వేసి, ఈ కేసు నుంచి తప్పుకోవాలని తనను కోరే అవకాసం ఉందని, ఈ పిటీషన్ చాలా తీవ్రమైనదిగా ఉందని, ఇప్పటికే తనను తప్పుకోవాలని రెండు పిటీషన్ లు వేసారని, ఇప్పుడు మరో సారి ప్రభుత్వం పిటీషన్ వేసే పరిస్థితి వద్దు అని, తన పరువు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నానని, అందుకే ఈ కేసు తన రిటైర్మెంట్ తరువాత, అంటే జనవరి మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. దీంతో తాను ఈ కేసు విచారణ చేయను అని చెప్పకనే చెప్పారు.