ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాద్ ని నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ దానికి సంబందించిన జీవో జారీ చేసారు. 1987 బ్యాచ్ కి చెందిన ఆదిత్యానాద్ దాస్ ఈ నెల 31 మధ్యానం నుంచి కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీ నీలం సాహనీ కొనసాగుతున్నారు. ఆమె పదవీ కాలం ఈ నెల 31కి ముగుస్తుంది. అయితే ఇప్పటికే, నీలం సాహనీ పదవీ కాలం ఆరు నెలల క్రిందటే ముగిసినా కూడా, ఇప్పటికే రెండు సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించి, ఆ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగించటం జరిగింది. క-రో-నా కాలంలో ఇప్పుడు చీఫ్ సెక్రటరీని మార్చితే ఇబ్బంది వస్తుందని చెప్పి, ఆవిడ పదవీ కాలాన్ని పొడిగించారు. దీనికి కేంద్రం కూడా ఒప్పుకుంది. ఇక ఈ సారి ఆమె రిటైర్డ్ అవ్వటం అనివార్యం అవ్వటంతో, కొత్త చీఫ్ సెక్రటరీ పై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో మొదటి నుంచి ఆదిత్యానాద్ దాస్ పేరు ప్రముఖంగా వినిపించింది. జగన్ మోహన్ రెడ్డికి , ఆదిత్యానాద్ దాస్ కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో, వేరే వారు పోటీకి వచ్చినా, చివరకు చీఫ్ సెక్రటరీ పదవి ఆదిత్యానాద్ దాస్ కే దక్కింది. అందరూ భావించినట్టే, అందరి అంచనాలకు తగ్గట్టే, ఆదిత్యనాద్ ని కొత్త చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే పదవీ విరమణ చేస్తున్న నీలం సాహనీకి మాత్రం, ఆవిడ పదవి అయిపోయినా సరే జగన్ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నీలం సాహనీ పదవీ విరమణ అవ్వగానే, ఆమెను ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆమెకు జగన్ మోహన్ రెడ్డి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్ధం అవుతుంది. ఇక అలాగే మరి కొంత మంది ఐఏఎస్ అధికారులకు కూడా పోస్టింగ్ లు ఇచ్చారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారిగా ఉంటూ, జగన్ కేసుల్లో జైలుకు వెళ్ళిన అధికారి శ్రీలక్ష్మికి పురపాలకశాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఆమె మొన్నటి వరకు తెలంగాణా ప్రభుత్వంలో పని చేసేవారు. అయితే ఆమె సొంత రాష్ట్రానికి వెళ్ళిపోతానని చెప్పటంతో, ఏడాది ప్రయత్నాలు తరువాత కేంద్రం ఒప్పుకోవటంతో, గత వరామే ఆమె తెలంగాణా నుంచి ఏపి క్యాడర్ కు మారారు. దీంతో ఆమెకు కీలకమైన పురపాలకశాఖ కార్యదర్శిగా నియమించారు. ఇక జలవనరులశాఖ కార్యదర్శిగా మరో అధికారి శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. ఇక రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.