ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ముందు, బీజేపీని ఉత్తరాది పార్టీ అని చెప్పిన జనసేన పార్టీ, ఎన్నికలు అయిన తరువాత, మారిన రాజకీయ పరిస్థితిలో బీజేపీతో కలిసింది. బీజేపీ, జనసేన కలిసి రాజకీయ శక్తిగా ఏర్పడ్డారు. అయితే ఇక్కడ వరకే కానీ, ఎదో ఒకటి రెండు సందర్భాలు తప్పితే, ఎవరి పర్యటనలు వాళ్ళు, ఎవరి నిరసనలు వాళ్ళు తెలుపుతున్నారు. మిత్రపక్షాలు రెండు కలిసి చేసిన కార్యక్రమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. జనసేన తమ కార్యక్రమాలు తాము చేసుకుని పోతుంటే, బీజేపీ తనదైన శైలిలో వెళ్తుంది. ముఖ్యంగా సోము వీర్రాజు అధ్యక్ష్యుడు అయిన తరువాత, ఆయన వైఖరి జగన్ కు అనుకూలంగా బయటకు కనిపించటంతోనే, పవన్ కొంచెం దూరంగా ఉన్నారనే వైఖరి కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే, ఎన్నికల విషయంలో కూడా జనసేనను బీజేపీ పట్టించుకోవటం లేదనేది అర్ధం అవుతుంది. హైదరాబాద్ జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఇదే వైఖరితో, పవన్ కళ్యాణ్ కు విసుగు పుట్టి, తమ అభ్యర్ధుల జాబితా కూడా ఇచ్చేసారు. అయితే తరువాత రంగంలోకి దిగిన బీజేపీ పెద్దలు, జనసేనను పోటీ నుంచి తప్పించేలా చేసారు. ప్రతి సందర్భంలో జనసేనను దూరంగానే పెట్టారు తెలంగాణా బీజేపీ నేతలు. అయితే ఈ సంఘటనలు తరువాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి, బీజేపీ అధ్యక్షుడు నడ్డాని కలిసి, తిరుపతి ఎంపీ సీటు జనసేనకు ఇవ్వాలని కోరారు.
దీని పై కమిటీ వేద్దాం అని నడ్డా చెప్పటంతో, పవన్ వచ్చేసారు. అయితే కమిటీ ఏమి చెప్పకుండానే, సోము వీర్రాజు బీజేపీ అభ్యర్దే తిరుపతి ఎంపీ సీటు పోటీ చేస్తున్నారని చెప్పేసారు. దీంతో జనసేన కౌంటర్ స్ట్రాటజీ ప్రారంభించింది. జనసేన పార్టీ తమ పార్టీ తరుపున ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. బీజేపీకి గతంలో నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని, జనసేన బలంగా ఉందని తేల్చారు. గతంలో ఇక్కడ చిరంజీవి గెలిచిన విషయాన్ని గుర్తు చేసారు. అలాగే కేంద్రం పై తిరుపతి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఇక్కడే ప్రత్యెక హోదా ప్రకటించి ఇవ్వలేదని, అలాగే ఒక్క అంతర్జాతీయ విమానం కూడా ఇక్కడకు తీసుకు రాలేదని, ఐఐటీకి ఇప్పటికీ సొంత భవనాలు లేవని, అందుకే కేంద్రం పై తిరుపతి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తేల్చారు. ఇక తిరుపతి స్థానిక జనసేన నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి, బీజేపీని కౌంటర్ చేస్తున్నారు. జనసేన నేత కిరణ్ మాట్లాడుతూ, సోము వీర్రాజు ఏకపక్షంగా మాట్లాడారని, అభ్యర్ధి ఎవరు అనేది, జేపీ నడ్డా, పవన్ చర్చించి ప్రకటిస్తారని చెప్పారు. ఆ అభ్యర్ధి ఎవరో వీర్రాజు కూడా తెలియదని అన్నారు. దీంతో ఇప్పుడు బీజేపీ, జనసేన మధ్య సయోధ్య కుదురుతుందా, ఎవరు తగ్గుతారు అనేది చూడాలి.