శ్రీకాకుళం జిల్లాలో గౌతు లచ్చన్న విగ్రహం విషయం పై, మంత్రి అప్పల రాజు చేసిన రచ్చ గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. మంత్రి అప్పలరాజు, ఆ స్థలం పై చేసిన ఆరోపణల విషయం పై, ఆ స్థల యజమాని స్పందిస్తూ, అప్పలరాజు మాటలను ఖండించారు యజమాని పాపారావు. ఆ భూమికి సంబంధించి పూర్తి ఆధారాలు మీడియా ముందు బయట పెట్టారు. గౌతు లచ్చన్న విగ్రహం ఎక్కడ ఉందో, ఆ స్థలం తనదే అని, జిరాయితీ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మంత్రి అప్పల రాజు చెప్తున్న స్థలం సర్వే నంబర్ కు, అక్కడ విగ్రహం ఉన్న స్థలం సర్వే నంబర్ వేరు వేరని అన్నారు. రాజకీయ ఆరోపణల కోసం తన స్థలాన్ని వివాదం చేయడం దారుణం అని పాపారావు అన్నారు. అయితే నిన్న ఈ విషయం పై నిరసనకు దిగిన తెలుగుదేశం నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ టిడిపి ఉపాధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన స్వగ్రామం నిమ్మాడలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో గురువారం ఉదయం నుంచి తనను తన ఇంటినుంచి కదలనీయకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు.
పలాసలో స్వాతంత్ర్య సమరయోధులు, దివంగత నేత సర్దార్ గౌతు లచ్చన్నపై అనుచిత వ్యాఖ్యలు ఇటీవల చేసినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ నిరసన ప్రదర్శన తలపెట్టారని, అయితే తాను అక్కడకు వెళతానని ఎటువంటి ప్రకటన చేయలేదని, ఎవరికీ సమాచారం కూడా ఇవ్వలేదని, అయినప్పటికీ పోలీసులు తనను ఇంటినుండి కదలనీయకుండా తన హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. తనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో స్థానిక పోలీసులనుంచి రాతపూర్వకంగా పత్రాలు తీసు కున్నానని, దీనిపై తాను పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో మాట్లాడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి నిర్ణయించినట్లుగా అచ్చెన్నాయుడు ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకూ ఏ డిజిపి వ్యవహరించని విధంగా ప్రస్తుత డిజిపి కళ్లకు గంతలు కట్టుకుని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇటువంటి డిజిపిని ఎప్పుడూ చూడలేదని ఆయన ధ్వజమెత్తారు. జిల్లాలో అధికార వైకాపా నాయకులు ముఖ్యమంత్రి పుట్టిన రోజున ఇష్టానుసారం సభలు నిర్వహించినా ఎపి ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా ప్రతిపక్షం శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్దంగా కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయిస్తే అడ్డుకోవడం ఈ జిల్లా పోలీసుల వైఖరి దారుణంగా ఉందని ఆయన అన్నారు.