దాదాపుగా 4-5 నెలల క్రిందట, కర్నూల్ జిల్లాలో పేకాట డెన్ ఒకటి బయట పడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన సంచలనం అవ్వటానికి కారణం, ఆంధ్రప్రదేశ్ కార్మిక, న్యాయ శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం సొంత గ్రామం కావటం, పట్టుబడిన వారిలో కొంత మంది మంత్రి గారి బంధవులు ఉండటం. అయితే మంత్రి జయరాం మాత్రం, ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పట్టుబడిన వారు తనకు దూరపు బంధవులని, ప్రతిపక్షాలు దీని పై అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం, ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతుందని, మంత్రి నిర్వహిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అప్పట్లో జరిగిన రైడ్ లో , 40 వాహనాలను, రూ.5.44 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు, 33 మందిని అరెస్ట్ కూడా చేసారు. అయితే ఈ సందర్భంగా పెద్ద హంగామానే జరిగింది. మంత్రి సోదరుడి అనుచరులుగా పేరు ఉన్న కొందరు, రైడ్ కి వచ్చిన పోలీసుల పై ఎదురు తిరిగారు. దీంతో పోలీసులు మరింత కఠినంగా ప్రవర్తించి, వారిని అరెస్ట్ చేసారు. ఈ ఘటన అందుకే పెద్దగా హైలైట్ అయ్యింది. అయితే మంత్రి మాత్రం, ఇలాంటి వాటిని తను ప్రోత్సహించను అని, వీటితో తనకు సంబంధం లేదని చెప్పారు. మంత్రి తమ్ముడు గుమ్మనూరు నారాయణ ఈ ఘటన వెనుక ఉన్నారని, ప్రతిపక్షాలు ఆరోపించాయి.
వీటి అన్నిటి నేపధ్యంలో, ఇప్పుడు ఈ కేసు హైకోర్టుకు చేరింది. ఈ ఘటన పై సిబిఐ విచారణ జరిపించాలని, మంత్రి పాత్రని తేల్చాలి అంటూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. మంత్రిగా ఉన్న వ్యక్తిపైనే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, స్థానిక పోలీసులతో కాకుండా, సిబిఐ విచారణ కోరారు. మంత్రినే ప్రతివాదిగా చేర్చటంతో, ఈ కేసుని హైకోర్టు అసలు అనుమతి ఇస్తుందో లేదో అని అందరూ అనుకున్నారు. ఏకంగా పోలీసులు పైన మంత్రి అనుచరులు దాడి చేసారని, దాడి చేసిన వారి పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీని వెనుక మంత్రి ఉన్నారని పిటీషనర్ తరుపున వాదనలు వినిపించగా, మంత్రి దీని వెనుక ఉంటే, అసలు పోలీసులు ఎందుకు దాడి చేస్తారు అంటూ, మంత్రి తరుపు న్యాయవాది వాదించారు. ఇరు వైపు వాదనలు విన్న న్యాయస్థానం, ఈ కేసుని విచారణకు తీసుకుంటున్నట్టు చెప్పింది. అయితే ఒక మంత్రి పైనే వేసిన కేసు, హైకోర్టు విచారణకు తీసుకోవటంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా దీని వెనుక ఉంది ఎవరో తెలుస్తాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇక మరో మంత్రి కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని, ఎలక్షన్ కమీషనర్, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ స్పందించక పొతే, ఈ కేసు కూడా కోర్టుకు చేరే అవకాసం ఉంది. మొత్తానికి మంత్రులు, ఇప్పుడు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే టైం వచ్చింది.