ఈఎస్ఐ కేసులో తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని, ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడుకు ఆపరేషన్ అయిన తరువాత రోజే, ఆయన్ను శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు, కారులో 15 గంటల పాటు తిప్పి, చివరకు కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే అచ్చెన్నాయుడుకి గాయం తిరగబడటంతో, డాక్టర్ల ఆదేశాలు ప్రకారం, హాస్పిటల్ లో జాయిన్ చేసారు. తరువాత గాయం మరీ పెద్దది కావటంతో, మళ్ళీ ఆపరేషన్ చేసారు. అయితే నిన్న ఏసీబీ కోర్టు అచ్చెన్నాయుడిని, మూడు రోజుల పాటు, ఏసిబీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. అచ్చెన్నాయుడి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి, ఆయన్ను హాస్పిటల్ లోనే విచారణ చెయ్యాలని, ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు అని, ఆదేశాలు ఇస్తూ, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం, ఈ రోజు నుంచి అచ్చెన్నాయుడిని మూడు రోజుల పాటు హాస్పిటల్ లోనే విచారణ చెయ్యనున్నారు. అయితే, ఏమైందో ఏమో కాని, అచ్చెన్నాయుడు ఉన్న, గుంటూరు జీజీహెచ్ లో, నిన్న అర్దరాత్రి ఉన్నట్టు ఉండి హైడ్రామా చోటు చేసుకుంది.
అచ్చెన్నాయుడిని నిన్న అర్దరాత్రి డిశ్చార్జ్ చేసేందుకు, గుంటూరు జీజీహెచ్ అధికారులు ప్రయత్నం చేసారు. అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేసిన వెంటనే, ఆధీనంలోకి తీసుకోవటానికి ఏసీబీ అధికారులు కూడా సిద్ధం అయ్యారు. అయితే ఇదంతా కుట్ర ప్రకారం చేస్తున్నారని, ఇప్పటికిప్పుడు అర్ధరాత్రి ఏమిటి అంటూ, తెలుగుదేశం నేతలు తెలుసుకుని, హుటాహుటిన హాస్పిటల్ కు వచ్చి, జీజీహెచ్ అధికారులను నిలదీసారు. తెలుగుదేశం అధికారులు నిలదియ్యటంతో, ఇప్పుడే డిశ్చార్జ్ చెయ్యటం లేదు అంటూ, వెనక్కు తగ్గారు. తమకు డిచ్చార్జ్ కాపీ ఇవ్వాలని, అచ్చెన్నాయుడు లాయర్లు కోరారు. అయితే డిశ్చార్జ్ ని రద్దు చేసామని అధికారులు చెప్పారు. ఆ రద్దు చేసిన కాపీ ఇవ్వండి అని కోరగా, అది కూడా ఇవ్వలేదని సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్ పై టిడిపి భగ్గుమంది. అచ్చెన్నాయుడును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఏదైనా ప్లాన్ చేసారా అనే తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మీరు చేసిన అరాచకానికి రెండు సార్లు ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటున్నారు అంటూ నిలదీశారు.