తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ, "మండలిలో మంత్రుల దుర్భాషలాడటం, మాపై దాడిచేయడంపై 18న చైర్మన్ కు తెదేపా ఫిర్యాదు చేస్తే చర్యలు లేవు. తమ తప్పులు బయటపడతాయని ఆరు రోజుల తర్వాత మంత్రులు కౌంటర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో వాస్తముంటే మండలిలో ఆనాడు జరిగిన సంఘటనలపై వీడియో ఫుటేజీ బయట పెట్టండి. మండలిలో 17న జరిగిన బిజినెస్ పై వైసీపీ మంత్రులు, నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. గతంలో మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపినపుడు లైవ్ టెలీకాస్ట్ ఆపేశారు. మండలిలో సమస్య ఉన్నప్పుడు లైవ్ టెలీకాస్ట్ నిలిపివేయడంలో ప్రభుత్వ ఉద్దేశాలు తేటతెల్లం అవుతున్నాయి. వాస్తవానికి అసెంబ్లీ ,మండలిలలో 13మంది చొప్పున మంత్రులు వంతులవారీగా ఉండాలి. కానీ 17 న ఒకేసారి 18 మంది మంత్రులు హాజరవడం తెదేపా సభ్యులపై దాడికి అన్నది స్పష్టం. వెల్లంపల్లిని తెదేపా సభ్యులంతా కొడితే తక్షణం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతూ మాపై ఫిర్యాదు చేసే వారు. కానీ అలా జరగలేదు. ద్రవ్య వినిమయ బిల్లును మండలిలో ప్రవేశ పెట్టనీయ కుండా మంత్రులే అడ్డుకుని తెదేపా సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మూడు రాజధానుల బిల్లును ఆమోదింప జేసుకోవడంపైనే మంత్రులు ఆసక్తి చూపారు. మూడు రాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీ వద్ద ఉందని ప్రభుత్వం కోర్టులో చెప్పింది.అలాంటప్పుడు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి ఆపై మూడు రాజధానుల బిల్లుపై మాట్లాడదామని చెప్పాం. కానీ వాస్తవం అలాఉంటే ...వైసీపీ మంత్రుల తప్పులు కప్పి పుచ్చడానికి తెదేపా సభ్యులపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారు."
"కౌన్సిల్ అవసరమా’’ అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ కన్నా మండలి స్థాయి పెద్దది. ఒక సభలోని సభ్యులు మరో సభపై ఆరోపణలు,వ్యాఖ్యానాలు చేయకూడదని తమ్మినేని గుర్తించాలి. ఆయన స్పీకర్ గాఉన్నారు కానీ రాజకీయ స్థానంలో లేరు. ద్రవ్య వినిమయ బిల్లు, మండలి గురించి వ్యంగ్యాస్తాలు చేయడం తమ్మినేనికి తగదు. వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడకూడదు. రాజ్యసభ చైర్మన్ అయిన తర్వాత వెంకయ్య నాయుడు బీజీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తించాలి. `కమ్మవైరస్’ అంటూ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను కులం పెట్టి దూషించడం తగదు. రాజ్యాంగ ప్రత్యేక వ్యవస్థ అయిన ఎస్.ఈ సి తో తమ్మినేనికి ఎం పని. రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేయడమేనా తమ్మినేని సంస్కృతీ,విధానం. మండలిలో రూల్స్ తెలుసుకుని నడుచుకోవాలి."
"మండలిని,చైర్మన్ , సభ్యులను ఇక నుంచీ అవమానకరంగా మాట్లాడితే తమ్మినేనిపై చర్యలు తీసుకుంటాం . స్పీకర్ స్థానాన్ని కాపాడాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎవరికీ ఫోన్ చేసినా తమ్మినేని సీతారాం భూకుంభకోణాలు,కలింగ కార్పోరేషన్ పేరుతో కులంపేరు చెప్పి, ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు చేయడం,ఏపీ ఎండీసీ వెబ్ సైట్ లో బుక్ చేస్తే నెలరోజులకు దొరికే ఇసుక తమ్మినేని ని సంప్రదిస్తే డబ్బులు ఎక్కువిస్తే ఒకేరోజులో లభ్యమవుతోందని చెబుతున్నారు. ఇసుక అమ్మకాలలో దొంగబిల్లులు ఇస్తున్న మిషన్ , బిల్లులను మాజీ శాసనసభ్యులు కూనా రవి కుమార్ పట్టిచ్చినా ఇంత వరకూ చర్యలులేవు. ప్రభుత్వ యంత్రాంగం,రాజకీయ నాయకులు కలసిపోయారు. వైసీపీకి చెందిన 95 ఎమ్మెల్యేలు, 12 ఎంపీలపై కేసులు, ఎఫ్ ఐ ఆర్ లు ఉన్నాయి.దేశంలోని ప్రాంతీయ పార్టీలలో వైసీపీ నేతలపైనే అత్యధిక కేసులున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలను కూలుస్తున్న చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదే. ఇటువంటి వ్యక్తుల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏమిటి? వైసీపీనేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడటం, మాటల్లో ప్రతిదీ అసత్యాలు,అబద్దాలు, ప్రతిపక్ష నాయకులపై దూషణలు ప్రజల ముందు పెడుతున్నాం. ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు,ఎవరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో ప్రజలే గమనించాలి. ఇప్పటికే అబద్దాలు,అసత్యాలు మాట్లాడి ప్రజల్లో వైసీపీ నేతలు అభాసుపాలయ్యారు. ఇప్పటికైనా వైసీపీ మంత్రులు, నాయకులు వాస్తవాలను మాట్లాడాలి, రాజకీయాల గౌరవాన్ని నిలబెట్టాలి."