రాష్ట్రంలో జగన్ పాలన ప్రారంభమై 14నెలలైనా, దళితులకు ఒక్క మేలు కూడా చేయలేదని, గత ప్రభుత్వం ఆయా వర్గాలకు అమలుచేసిన అనేక పథకాలను ఈ ప్రభుత్వం నిలిపివేసిందని, టీడీపీనేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగం ద్వారా దళితులకు చేకూరిన లబ్ధిని కూడా ఈ ప్రభుత్వం తానే చేస్తున్నట్లుగా చెప్పుకుంటోందన్నారు. రిజర్వేషన్లు ఎప్పటినుంచో దళితులు అనుభవిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వం దళితులకే వినియోగించిందని, ఈప్రభుత్వం సబ్ ప్లాన్ నే మరిచిపోయిం దన్నారు. రూ.40వేల కోట్ల పైచిలుకు నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద దళితులకు ఖర్చు పెట్టిందన్నారు. గత ప్రభుత్వం అమలుచేసిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని నిలిపేయడంద్వారా ఈ ప్రభుత్వం దళిత యువకులను దారుణంగా మోసగించిందన్నారు. ఆ పథకం కింద గత ప్రభుత్వం విదేశాలకు వెళ్లి చదువుకునే దళిత విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15లక్షలు అందించిదన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు లేకుండా నిర్వీర్యం చేసిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానిదేనన్నారు. దౌర్జన్యాలు, దుర్మార్గాలకు పాల్పడటం, అక్రమ కేసులు పెట్టడం, అన్యాయంగా చంపడం వంటి వాటినే ఈ ప్రభుత్వం దళితులకు అదనంగా ఇచ్చిందన్నారు.

దళితుల ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ అనేదళిత యువకుడికి జరిగిన శిరోముండనం జగన్ పాలనకే ఒక బ్లాక్ మార్క్ అని, అంతటి దురాగతానికి పాల్పడిన వారి వివరాలన్నీ బయటపెట్టి, వారిని దారుణంగా శిక్షించాలని ఆనందబాబు డిమాండ్ చేశారు. కవన కృష్ణమూర్తి, అతని అనుచరులు, బంధువులు, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో, విచారించాలని, ఎవరి ప్రోద్భలంతో శిరోముండనం జరిగిందో వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం ఒక ఎస్సైని, కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. ఏ ఎమ్మెల్యే చెబితే పోలీసులు ఆ పనిచేశారో చెప్పాలన్నారు. కేవలం పైపైన విచారణ జరిపి, శిరోముండనం వ్యవహారాన్నిమసిపూసి మారేడు కాయ చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఏంచేసినా దళితులు ఏమీ చేయలేరనే భావనలో ప్రభుత్వం ఉందని, అందులో భాగంగానే డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణిలపై వేధింపులకు పాల్పడ్డారని, జడ్జి శ్రావణ్ కుమార్ పై అక్రమకేసులు పెట్టడం, అడిషనల్ జడ్జి రామకృష్ణను 8ఏళ్లుగా వేధిస్తున్నారన్నారు. నేడు చీరాలలో జరిగిన ఘటనపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చెప్పాలన్నారు.

కిరణ్ కుమార్ అనే దళితయువకుడు మాస్కు పెట్టుకోలేదని చెప్పి అకారణంగా స్టేషన్ కు తీసుకెళ్లి దారుణంగా చావగొట్టడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయాడని దీనిపై ప్రభుత్వం ఏం చెబుతుందని నక్కా నిలదీశారు.
బాపట్లలో రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రికి రాత్రి పెకలించి పక్కన పడేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అన్నారు. దళిత బాలికపై దారుణంగా అత్యాచారం చేసి, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు పడేసినా, ఇంతవరకు ఆ దురాగతానికి పాల్పడిన వారెవరో జగన్ ప్రభుత్వం గుర్తించలేకపోయిందన్నారు. బాలికను పరామర్శించడానికి ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, ఆ అమ్మాయికి కరోనా వచ్చిందని చెప్పి, వాస్తవాలు ప్రజలకు తెలియనీయకుండా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించాడన్న అక్కసుతో 10ఏళ్లు ఎంపీగా పనిచేసిన హర్షకుమార్ ని జైల్లో పెట్టింది ఈ ప్రభుత్వం కాదా అని ఆనందబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు మాట్లాడే హక్కు లేకుండా పోయిందని, శిరోముండనం కేసులో ప్రతిఒక్కరూ బాధ్యులేనని, వరప్రసాద్ తో నడిరోడ్డుపై ఛాలెంజ్ చేసిన కవల కృష్ణమూర్తి, జిల్లా ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సోకాల్డ్ దళిత మేథావులంతా అలోచించాల్సిన సమయం వచ్చిందని, దళితులపై జరుగుతున్న దుర్మార్గాలకువ్యతిరేకంగా పోరాడాల న్నారు. జగన్ ని నమ్మి గంపెడాశతో ఓట్లేసిన దళితులంతా, ఇప్పుడు ఛీ అని ఛీదరించుకొనే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కరోనా కారణంగా వారంతా ప్రభుత్వవ్యతిరేక పోరాటంపై సంకోచిస్తున్నారని, త్వరలోనే రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తారన్నారు. ఈ ప్రభుత్వం దళితులపై జరుగతున్న దుర్మార్గాలపై స్పందించకపోతే భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకొని తీరుతుందని ఆనందబాబు తీవ్రస్వరంతో హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read