ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుందా ? జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో, జరుగుతున్న పరిస్థితుల పై, ఆర్ఎస్ఎస్ స్పందించలేదు. మొదటి సారిగా వారు, ఏపి రాజకీయాల పై బహిరంగంగా మాట్లాడటం పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒక పక్క వైసీపీకి మాత్రమే కాదు, బీజేపీకి కూడా వారు వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది. రాష్ట్రంలో బీజేపీలోని ఒక వర్గం, పార్టీ ఆదేశాలకు కాకుండా, అధికార వైసీపీకి సపోర్ట్ చెయ్యటం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక అంశం పై, ఆర్ఎస్ఎస్ ఇలా బయటకు వచ్చి క్లారిటీ ఇవ్వటంతో, ఇది బీజేపీకి కూడా వర్తిస్తుంది అనే సంకేతాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం గవర్నర్ పరిధిలో ఉంది. శాసనమండలి సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపించినా, ఈ అంశం కోర్టులో ఉన్నా సరే, ప్రభుత్వం, మూడు రాజధానులకు సంబందించిన రెండు బిల్లులను, గవర్నర్ ఆమోదానికి పంపించింది.
అయితే గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్న సమయంలో, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శార్ధ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు ముక్కల రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ట్వీట్ చేసారు. మూడు రాజధానుల బిల్లును గవర్నర్ వ్యతిరేకించాలని, ఆయన ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసారు. శాసనమండలిలో బిల్లుని రిజెక్ట్ చేసిన తరువాత కూడా, జగన్ పై చేయి సాధించాలని అనుకోవటం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్తున్న ప్రభుత్వాన్ని, గవర్నర్ అడ్డుకోవాలని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం పై, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ట్వీట్ చెయ్యటం చూస్తుంటే, రాష్ట్రంలో త్వరలోనే కీలక రాజకీయ మార్పులు వచ్చినా ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది.