ఇంతటి విపత్కర పరిస్థితిలో ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా, ప్రజల కోసం, పని చేస్తున్న మా పై, ఇష్టం వచ్చినట్టు అవమానకరంగా ప్రవర్తించటం దారుణం అంటూ, ఐఏఎస్ అధికారుల పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ వైద్యుల సంఘం, నిరసన వ్యక్తం చేస్తూ, ఆవేదనతో చీఫ్ సెక్రటరీ నీలం సహానీకి లేఖ రాసారు. తమ మనోభావాలు దెబ్బ తీస్తూ, అవమానకరంగా ఐఏఎస్ ఆఫీసర్లు ప్రవర్తిస్తున్నారని, తీరు మార్చుకోకుండా, ఇలా అవమానకరంగా ప్రవర్తిస్తే, పని చెయ్యటం కష్టం అంటూ, చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ జయధీర్ బాబు, అన్ని జిల్లాల్లో, డాక్టర్లను ఎలా అవమానిస్తున్నారో చెప్తూ, చీఫ్ సెక్రటరీకి మూడు పేజీల సుదీర్ఘ లేఖ రాసారు. తమ పై జరుగుతున్న వేధింపులు కనుక వెంటనే ఆపక పొతే, ధులు బహిష్కరించటానికి కూడా వెనుకాడమని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆర్ఎంపీలను ఇక నుంచి, కరోనా కేసులు చూడాలి అంటూ, చెప్పటం ఎంత వరకు సమంజసం ? ఇది మెడికల్ ఎథిక్స్‌కు విరుద్ధం కాదా ? అంటూ ప్రశ్నించారు. ఈ విషయం పై, మేడికల కౌన్సిల్ అఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇక ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్, విధులకు ఆలస్యంగా వచ్చారు అంటూ, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అని, సమావేశం అయ్యేంత వరకు హాలులో నుంచోమని చెప్పారని, ఇది తమకు ఎంత అవమానం అని లేఖలో తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా డీఎంహెచ్ఓ పై, ఐఏఎస్ లు అందరి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని తెలిపారు. అలాగే తమ పని చేసుకోనివ్వకుండా, ఇష్టం వచ్చినట్టు టెలికాన్ఫరెన్స్‌లు పెడుతూ, తమ పై పని ఒత్తిడి పెంచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పని ఒత్తిడితో ఉన్న తాము, అధికారులు పెట్టే వేధింపులు తట్టుకోలేక పోతున్నాం అని, వెంటనే ఇవి ఆపాలని కోరారు.