రాష్ట్ర రాజధానిని తరలించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రేపటితో 200 రోజులు గడిచిపోయాయి. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 2015లో రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చి న రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ మరుసటి రోజు నుండే రాజధాని అమరావతినే కొనసాగించాలని రైతులు తలపెట్టిన ఉద్యమానికి రేపటితో 200 రోజులు పూర్తి కావస్తుందని రాజధాని జెఎసి ప్రకటించింది. మూడు ముక్కల రాజధానులకు వ్యతిరేకంగా ఏపికి ఏకైక రాజధానిగా ఆమరావతినే కొనసాగించాలని వేలాదిమంది రైతులు, మహిళలు, వివిధ ప్రజాసంఘాలు, ఆఖకిలపక్ష పార్టీల సహకారంతో అమరావతి పరిధిలో ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ఇదే తరుణంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్నందున స్వచ్చంధంగా ఇంటిలోనే సభ్యులు కలసి నిరసనలు కొనసాగించే కార్యక్రమం చేపట్టిన సందర్భాలు చోటుచేసుకున్నాయి. రాజధాని తరలింపు వార్తల నేపధ్యంలో రాజధాని రైతులు మృతిచెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
రాజధాని జేఎసితోపాటు కొందరు రైతులు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాష్ట్ర శాసన మండలిలో కూడా పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం లభించని విషయం తెలిసిందే. వీటి అన్నిటి మధ్య రేపు అమరావతి పోరాటం 200 రోజులకి చేరుకుంటుంది. అయితే, సరిగ్గా ఇలాంటి సమయంలోనే, అమరావతి రైతులకు మద్దతు తెలపటానికి, ఒక అధికార పార్టీకి చెందిన ఎంపీ సంఘీభావం తెలుపుతున్నారని, అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. ఆయన ఎవరో కాదు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. అమరావతి మూడు ముక్కలు చేసినందుకు, రైతులను రోడ్డుపాలు చేసి, మహిళల పై లాఠీ దెబ్బలు తగిలినా, 200 రోజులుగా అమరావతి వాసులు చేస్తున్న పోరాటానికి, మద్దతుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రఘురామకృష్ణం రాజు మాట్లాడి, అమరావతి వాసులకు మద్దతు తెలపనున్నారు. ఒక పక్క వైసిపీ పార్టీ మొత్తం అమరావతిని హేళన చేస్తుంటే, అదే పార్టీకి చెందిన ఎంపీ, అమరావతి రైతులకు మద్దతు తెలపనున్నారు.