గుణం లేనివాడు కులం గురించి ఆలోచిస్తాడని, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడన్న గుర్రం జాషువా వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి అతికినట్లుగా సరిపోతాయని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. ఆదివారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. స్వర్ణప్యాలెస్ ఘటనకు డాక్టర్ రమేశ్ ఒక్కడినే బాధ్యుడిని చేసి, ఆయన్ని వేటాడటం ప్రభుత్వానికి తగదని, స్వర్ణప్యాలెస్ హోటల్ ను, రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ ఆసుపత్రిగా తీసుకుందని, అంతకు ముందు అది క్వారంటైన్ కేంద్రంగా ఉందన్నారు. విజయవాడ విమానాశ్రయంలో దిగిన వారందరినీ 14రోజుల క్వారంటైన్లో ఉంచడం కోసం, ప్రభుత్వం నగరంలోని 15 హోటళ్లను ఎంపిక చేసిందని, వాటిలో స్వర్ణ ప్యాలెస్ ఒకటని రామయ్య తెలిపారు. హోటళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చినప్పుడు, ఆనాడు వాటన్నింటిలో ఫైర్, ఇతర వసతులున్నాయో లేదో ప్రభుత్వం ఎందుకు పరిశీలించలేదన్నారు.

గొప్ప హృద్రోగ నిపుణిడిగా పేరు ప్రఖ్యాతులు పొంది, వేలాదిమందిని రక్షించిన డాక్టర్ రమేశ్ బాబు గురించి రాష్ట్రమంతా తెలుసునని, ఈ ప్రభుత్వం మాత్రం అతనిగొప్పతనాన్ని చూడకుం డా, అతనికులాన్ని మాత్రమే చూసి, అతని వెంటపడుతోంద న్నారు. దేశప్రథమపౌరుడు అతని ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారన్నారు. విజయవాడలో జరిగిన ప్రమాదంలో రమేశ్ బాబు, సదరు ఆసుపత్రి ప్రమేయం ఎంతుందో, మిగిలిన అధికారుల, ప్రభుత్వపాత్ర ఏమిటో విచారించకుండా, నిజానిజాలు తేల్చకుండా, ఒక వ్యక్తినే లక్ష్యంగా చేసుకోవడం ఏమిటని వర్ల ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం తనస్వార్థం కోసం ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా విభజిస్తోందన్నారు. ప్రభుత్వ నడక, నడత, వ్యవహారశైలి ఏమాత్రం సక్రమంగా లేవన్న వర్ల, విజయవాడ దుర్ఘటనలో పదిమంది చనిపోవడం తమకు కూడా బాధకలిగిం చిందని, దాన్ని అడ్డుపెట్టుకొని డాక్టర్ రమేశ్ బాబుని వేటాడటం ఏమిటన్నారు. వివరాలు, విచారణతో సంబంధం లేకుండా డాక్టర్ రమేశ్ బాబు అలియాస్ రమేశ్ చౌదరిని అరెస్ట్ చేయడమే జగన్ ప్రభుత్వ అభిలాష అన్నారు. ప్రభుత్వం ఎందుకింతలా కులవ్యవస్థ పై పడి కొట్టుమిట్టాడుతోందని, కమ్మ..కమ్మ అంటూ ఆ కులంపై పడి ఎందుకింతలా ఏడుస్తోందని రామయ్య మండిపడ్డారు.

సెక్యులర్ దేశంలో కులంపేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేట న్నారు. ఏప్రభుత్వం ఉన్నప్పుడు, ఏకులానికి న్యాయం జరిగిందో విచారించడానికి తాను సిద్ధమని, జగన్ ప్రభుత్వం నుంచి ఎవరొస్తారో రావాలని రామయ్య సవాల్ చేశారు. పోలీస్ శాఖలో ఎంతమంది కమ్మవారు వీఆర్ లో ఉన్నారో, ఎంతమంది రెడ్లకు రాత్రికి రాత్రి పోస్టింగులు ఇచ్చి, ప్రమోషన్లు అప్పగించారో చర్చకు రావాలన్నారు. ఏడాది నుంచి కమ్మవర్గానికి చెందిన పోలీస్ అధికారులు వీఆర్ లో ఉన్నారని, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. జగన్ వచ్చాక రాష్ట్రాన్ని మూడుముక్కలు చేసి, ముగ్గురు రెడ్లకు అప్పగించారని, తనచుట్టూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, కల్లం అజయ్ రెడ్డిలాంటి వాళ్లనే పెట్టుకున్నాడన్నారు. జగన్ తన కంట్లోని దూలాన్ని పట్టించుకోకుండా, ఎదుటివారి కంట్లోని నలుసుపై పడటం ఏమిటన్నారు. దళితులను కూడా ఇదేవిధంగా వేధిస్తున్నారని, దళితయువకుడికి శిరోముండనం చేసిన కవల కృష్ణమూర్తిని ఈ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు? ప్రభుత్వం గతంలో క్వారంటైన్ కేంద్రంగా వినియోగించిన స్వర్ణప్యాలెస్ నే రమేశ్ బాబు కోవిడ్ కేంద్రంగా వినియోగించారని, దానికి ఆయనొక్కడే ఎలా బాధ్యుడవుతాడని వర్ల నిలదీశారు. ఫైర్ అనుమతులు లేనప్పుడు ప్రభుత్వం దాన్ని క్వారంటైన్ కేంద్రంగా ఎలా ఉపయోగించిందని, అధికారులు ఏం చేశారని టీడీపీనేత ప్రశ్నించారు. నంద్యాల ఎస్పీవై ఆగ్రోస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం, రాంకీసెజ్ లో జరిగిన ప్రమాదంలో ఎవరిపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుందో సమాధానం చెప్పాలన్నారు. ఆకులం, ఈ కులం అని అధికారులను వేధిస్తున్నారని, ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read