అమరావతి ఒక స్మశానం. అమరావతి గ్రాఫిక్స్. అమరావతిలో పందులు తిరుగుతాయి. అది అమరావతి కాదు భ్రమరావతి. ఇలా అమరావతి పై, ఇష్టం వచ్చినట్టు తిట్టిన వైసీపీ మంత్రుల స్వరంలో, గత రెండు రోజుల నుంచి ఎందుకో మార్పు కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏమిటో అర్ధం కావటం లేదు. నిన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అమరావతి తరలింపు గురించి ఇప్పుడు ఆలోచించటం లేదని, ఏదైనా కరోనా తగ్గేదాకా ఆగాల్సిందే అని అన్నారు. ప్రస్తుతానికి, అమరావతి తరలింపు లేదని చెప్పారు. ఈయన చెప్పిన రోజే, నిన్న సాయంత్రం మరో మంత్రి బొత్సా సత్యన్నారాయణ, అమరావతిలో పర్యటన చేసారు. నిన్న బొత్సాని చూసిన రాజధాని రైతులు, ఏదో పని మీద వచ్చారులే అనుకున్నారు. అయితే, బొత్సా ఈ రోజు కూడా, అమరావతిలో పర్యటించారు. సీఆర్డీఏ కమీషనర్, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులతో కలిసి, ఈ రోజు బొత్సా అమరావతిలో పర్యటించారు. ముఖ్యంగా చంద్రబాబు హయంలో పూర్తిగా పూర్తయిన బిల్దింగ్లు, అలాగే 90, 80 శాతం పూర్తయిన ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, హెచ్‌వోడీఎస్ క్వార్టర్స్, ఎన్జీవో క్వార్టర్స్ ని పరిశీలించారు. అన్ని బిల్డింగ్స్ లో తిరిగారు. తానూ ఏదైతే స్మశానం అన్నారో, ఏదైతే గ్రాఫిక్స్ అన్నారో, అవే బిల్డింగ్ల వద్దకు వెళ్లి, ఆ బిల్డింగ్లు ఎక్కి, ఆ బిల్డింగులలో తిరిగి, ఇవి గ్రాఫిక్స్ కాదు, ఇవి శాశ్వత భవనాలు అని, ఆయనే చెప్పారు.
అయితే, బొత్సా పర్యటన పై, అమరావతి రైతుల్లో చర్చ మొదలైంది. ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చారో, ఎవరికీ అర్ధం కాలేదు. గత వారమే, అసెంబ్లీలో సీఆర్డీఏ రద్దు బిల్లు పెట్టారు. ఇప్పుడు, ఇలా ఒక మంత్రి, ఇప్పుడే తరలింపు ఉండదు అని, మరో మంత్రి అమరావతిలో పనులు పై సమీక్ష చెయ్యటం చర్చకు దారి తీసింది. ముందుగా వాదన ఏమిటి అంటే, చేసుకున్న ఒప్పందం ప్రకారం, అక్కడ ఎదో ఒకటి కట్టాలి, లేకపోతే కోర్టు ఊరుకోదు. గత ఏడాదిగా ఏమి చేసారు అని కోర్టు అడిగితె సమాధానం లేదు. ఇక మరో విషయం, కరోనా టైంలో రాజధాని తరలింపు అసాధ్యం. వచ్చే అకాడమిక్ సంవత్సరం దాకా, ఉద్యోగులు కూడా మధ్యలే వెళ్ళలేరు, పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఇది ఒక కారణంగా చెప్తున్నారు. అలాగే లీగల్ గా, రాజధాని వ్యవహారం కోర్టులో ఉంది, అది ఎప్పటికి తేలుతుందో తెలియదు, అప్పటి దాకా అమరావతి రాజధానిగానే ఉండాలి, అందుకే ఇప్పటి వరకు కట్టిన భవనాల్లో, ఉద్యోగులు నివాసం ఉండే పరిస్థితి ఉందా అనే విషయం పై కూడా ఈ పర్యటన జరిగినట్టు చెప్తున్నారు. ఏది ఏమైనా, అమరావతి తరలింపు ఇప్పుడప్పుడే ఉండదు అని తేలిపోయింది. అమరావతి రైతులు మాత్రం, ఇప్పుడే కాదని, ఎప్పటికీ అమరావతిని తరలించలేరని, చెప్తున్నారు.