ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విషయంలో, మరో టర్న్ తీసుకునే అవకాసం కనిపిస్తుంది. ఈ విషయం పై, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు హైకోర్టులో, ప్రభుత్వం పై కోర్టు ధిక్కరణ వేసే అవకాసం ఉంది అనే ప్రచారానికి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ట్వీట్ బలం చేకూరుస్తుంది. రమేష్ కుమార్ ని ప్రభుత్వం తొలగించటం పై, ఆయన హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్ట్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ కొట్టేసింది. అలాగే కొత్త ఎన్నికల కమీషనర్ ని నియమిస్తూ ఇచ్చిన జీవో, రమేష్ కుమార్ ని తప్పిస్తూ ఇచ్చిన జీవోలను కూడా సస్పెండ్ చేసింది హైకోర్టు. దీంతో రమేష్ కుమార్, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా, నియామకం అయినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం, మరో వాదనతో ముందుకు వచ్చింది. హైకోర్టు రమేష్ కుమార్ ని నియమిస్తూ ఆదేశాలు ఇవ్వలేదని చెప్పింది. కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం కుదరదు అని చెప్పిన కోర్టు, అదే నిబంధనలు ప్రకారం ఎన్నికైన నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదు అని ప్రభుత్వం, హైకోర్టు తీర్పు పై తమ అభిప్రాయం చెప్పింది. అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలి అంటూ, సుప్రీం కోర్టుకు కూడా ప్రభుత్వం వెళ్ళింది.
ప్రభుత్వంతో పాటుగా, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అయితే సుప్రీం కోర్టు మాత్రం, స్టే ఇవ్వటానికి ఒప్పుకోలేదు. అయితే, ఇప్పటికే హైకోర్టు తీర్పు ప్రకారం, నిమ్మగడ్డ తాను మళ్ళీ చార్జ్ తీసుకున్నట్టు, అన్ని జిల్లాలకు సర్కులర్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఈ సర్కులర్ ని కొట్టేసింది. దీంతో, ఇప్పుడు నిమ్మగడ్డ రేపు హైకోర్టులో, కోర్టు ధిక్కార పిటిషన్ వెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. హైకోర్టు తనను తీసుకోవాలని చెప్పినా, ప్రభుత్వం తనను చార్జ్ తీసుకోనివ్వకుండా ఆటంకం కలిగిస్తున్నారు అంటూ, ప్రభుత్వం పైనా, చీఫ్ సెక్రటరీ పైనా, ఆయన రేపు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసే అవకాసం ఉంది అంటూ, సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ట్వీట్ చేసారు. రేపటి లోగా, ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తుందా అంటూ, జంధ్యాల రవిశంకర్ ట్వీట్ చేసారు. దీంతో, ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఏమి చెప్తుంది ? కోర్టు ధిక్కరణ కింద భావిస్తుందా అనేది చూడాలి. ఇప్పటికే రంగులు విషయంలో, చీఫ్ సెక్రటరీ పై కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే.