విజయసాయి రెడ్డి అతి పెద్ద కుంభకోణం చేసారంటూ, రూ.307 కోట్ల స్కాం వివరాలు తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం బయట పెట్టారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన "జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఈ సంవత్సరకాలంలో అన్ని రంగాల్లో కుంభకోణాలు చూశాం. ఇసుక, మద్యం, ఇళ్ల పట్టాలు ఇలా ఒకటేమిటి చివరికి కరోనా కిట్లు, పారిశుధ్యం కోసం చల్లే బ్లీచింగ్ పౌడర్ లో కూడా కుంభకోణాలకు పాల్పడ్డారు. దీనికితోడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో జే ట్యాక్స్ పేరుతో వేల కోట్లు బొక్కేస్తున్నారు. తాజాగా 108 అంబులెన్సుల కొనుగోళ్లు, నిర్వహణలో భారీ స్కాం జరిగింది. ట్విట్లర్లో రోజూ కూతలు కూసే జగన్ ఆత్మ విజయసాయి రెడ్డి ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి. నిర్వహణ పేరుతో 108 అంబులెన్సుల్లో రూ.307 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. 2016కి ముందు వరకు జీవీకే ఈఎంఆర్ సంస్థ అంబులెన్సుల్ని నిర్వహించేది. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2011 అక్టోబర్ 1 నుండి 2016, 30 సెప్టెంబర్ వరకు ఒప్పందం జరిగింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందం విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండా.. జీవీకే నిర్వహణకు అన్ని విధాలుగా సహకరించారు. 2016లో ఓపెన్ టెండర్లు పిలవడం ద్వారా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పాటు, లండన్కు చెందిన యుకే ఎస్ఏఎస్ భాగస్వామ్యం కలిగిన బీవీజీ కంపెనీ టెండర్లు దక్కించుకుంది. నియమనిబంధనలకు అనుగుణంగా2017, డిసెంబర్ 13న ఐదేళ్ల కాలపరిమితితో కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది.
ఈ కాంట్రాక్టు 2020, డిసెంబర్ 12 వరకు ఉంటుంది. అయితే.. మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతోనే.. 2019, సెప్టెంబర్ 5న ఉన్న అంబులెన్సులకు అధనంగా మొత్తంగా 439 అంబులెన్సులు కొనుగోలు చేసేందుకు 105 జీవో ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రబుత్వంపై భారం లేకుండా ఉండేందుకు ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2019, సెప్టెంబర్ 20న పాత, కొత్త అంబులెన్సుల నిర్వహణకు సంబంధించి కొత్త ఏజెన్సీని గుర్తించాలని 111 జీవో విడుదల చేశారు. బీవీజీ సంస్థ కాంట్రాక్టు పరిమితి ముగియక ముందే కొత్త సంస్థను గుర్తించాల్సిన అవసరం ఏమిటో ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖా మంత్రి సమాధానం చెప్పాలి. 2019, అక్టోబర్ 18న అంబులెన్సులను పైనాన్స్ విధానంలో కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, నేరుగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేలా జీవో నెం.117 విడుదల చేశారు. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఉండకూడదని ఫైనాన్స్ అన్న ప్రభుత్వ పెద్దలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి కారణమేంటి.? ఎవరితో ఎంత కమిషన్ కోసం ఈ జీవో మార్పు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మొదటి నుండి ఆరోగ్యశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంబులెన్స్ సర్వీసులను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద నిర్వహించే 2019, అక్టోబర్ 30న జీవో నెం.566 ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు డిప్యూటీ సీఈవో అనే వ్యక్తిని ఆఘమేఘాలపై డైరెక్టర్ గా నియమించారు. ఈ మార్పు ఎందుకు చేశారో ముఖ్యమంత్ర సమాధానం చెప్పాలి.
ఈ అంబులెన్సులను కొనుగోలు చేయడం కోసం రూ.71.48 కోట్లను అంబులెన్సుల కొనుగోలు కోసం విడుదల చేస్తున్నట్లు 2019, డిసెంబర్ 30న 679 జీవో ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు డిప్యూటీ సీఈవోగా నియమించిన రాజశేఖర రెడ్డికి నెల రోజులకే పదోన్నతి కల్పిస్తూ అడిషనల్ సీఈవోగా పదోన్నతి కల్పిస్తూనే.. ఆరోగ్యశ్రీ నిర్వహణ మొత్తం అతని చేతుల్లో పెడుతూ జీవో నెం.72 ఇచ్చారు. ఒక ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందం అమల్లో ఉండగానే.. దాన్ని రద్దు చేసి కొత్త అంబులెన్సులకు నెలకు రూ.1.78లక్షలు, పాత అంబులెన్సులకు రూ.2.21లక్షలు చొప్పున నిర్వహణ ఖర్చుల కింద చెల్లించేలా 2020, ఫిబ్రవరి 13న జీవో నెం116 విడుదల చేశారు. కానీ.. బీవీజీ సంస్థ ఒక్కో అంబులెన్సుకు రూ.1.31 లక్షలకే నిర్వహిస్తుంటే.. ఆ సంస్థను కాదని అరబిందో ఫౌండేషన్ సంస్థకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది.? జగన్మోహన్ రెడ్డి ఆత్మ అయిన విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ కు చెందిన అరబిందో ఫౌండేషన్ కు ఉన్నఫలంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా 108 అంబులెన్సుల నిర్వహణలోనే రూ.307 కోట్ల కుంభకోణం జరిగింది. ఇది కేవలం 108లో మాత్రమే. 104లో మరింత కుట్ర జరిగిందో.? ఒక సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్టును అర్ధాంతరంగా రద్దు చేసి సొంత కంపెనీకి కట్టబెట్టడంలో విజయసాయి రెడ్డి పాత్ర లేదంటారా.? ఈఎస్ఐలో ఏమీ లేని చోట ఏదో జరిగిపోయిందని ఆరోపిస్తూ.. ట్విట్టర్ లో కూతలు కూస్తున్న విజయసాయి రెడ్డి ఈ విషయంలో సమాధానం చెప్పాలి. ఏమీ లేని చోట ఏదో అవినీతి జరిగిందని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి.. విజయసాయి రెడ్డి కుంభకోణాలను సాక్ష్యాధారాలతో బయటపెడుతున్నాం. అతనిపై ఏ చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి" అని పట్టాభిరాం అన్నారు.