అమరావతిలో అంత మంది ఆందోళన చేస్తున్నా, కేసులు హైకోర్టులో ఉన్నా, విశాఖ వెళ్ళిపోవటానికి ప్రభుత్వం తొందరపడుతుంది. ముందుగా ఈ నెల 16న రాజధానిగా విశాఖపట్నంలో శంకుస్థాపన చెయ్యాలని నిర్ణయం తీసుకోగా, కోర్టులో కేసు ఇంకా సుప్రీం కోర్టు తీసుకోకపోవటంతో, విజయదశమి రోజున భూమిపూజకు ప్రభుత్వం ముహూర్తం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మూడు ముక్కల రాజధాని పై హైకోర్టులో రైతులు వేసిన పిటిషన్ల పై 14న విచారణ జరిగి తీర్పు వెలువడే అవకాశాలున్నాయని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. పాలనా రాజధాని విశాఖలో భూమిపూజకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇందులో భాగంగా ఈ నెల 16నే భూమిపూజ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ ముహూర్తం దాటితే మరో రెండు నెలల వరకు వేచి ఉండాలి. త్వరలో శూన్యమాసం ప్రారంభమవుతున్నందున అక్టోబర్ 25న దసరా విజయదశమిని ఎంచుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం.

అమరావతి రాజధానిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సరిగ్గా 2015 అక్టోబర్ 21న విజయదశమి రోజునే శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో తిరిగి ప్రధాని మోదీతో అదే రోజున భూమిపూజ చేయించాలని జగన్ మదిలో మాటగా చెప్తున్నారు. మరి అమరావతి ఇలా నాశనం అయిన, అదే రోజు శంకుస్థాపన అంటే మోడీ ఒప్పుకుంటారా ? ఈ నెల 16న రాజధాని శంకుస్థాపనకు హాజరు కావాలని ఇప్పటికే ప్రధానమంత్రి కార్యరాయాన్ని కోరారు. ఇప్పటికిప్పుడు ప్రధానమంత్రి రాక కష్టతరం కావటంతో పాటు కోర్టు కేసుల దృష్ట్యా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా ప్రభుత్వం తరుపున హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసేందుకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఉన్న న్యాయవాదులు చేస్తున్న వాదనలతో కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలు తగలటంతో, ఇప్పుడు వ్యూహం మార్చి, రాజధాని పై అఫిడవిట్లు తయారు చెయ్యటానికి, సీనియర్ అధికారులకు ప్రభుత్వం బాధ్యత అప్పచెప్పింది.

పురపాలకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శ్యామలరావు నేతృత్వంలో మరో అధికారికి ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఏపీ సచివాలయాన్ని మిలీనియం టవర్స్ లేదా ఆంధ్ర యూనివర్శిటీలో కానీ ఏర్పాటు చేసేందుకు గతంలో పరిశీలన జరిపారు. ఇందులో పేచీలు తలెత్తటంతో కాపులుప్పాడ వద్ద కొత్తగా సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీనికి భూమిపూజ చేయనున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి భీమిలి బీచ్ రోడ్డులోని గ్రేహౌండ్స్ అతిథిగృహంలో ముఖ్యమంత్రి కార్యాలయం, శంకుస్థాపన నిర్వహించనున్నట్లు తెలిసింది. సింహాచలంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు ఎండోమెంట్స్ ట్రిబ్యునల్, అక్కడికి సమీపంలోని గోశాలలో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read