ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో, భారీగా నగదు పట్టుబడింది. వైసీపీ మంత్రి స్టిక్కర్ ఉన్న ఫోర్చ్యునర్ కారులో, రూ.5.22 లక్షలను ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు తరలిస్తూ ఉండగా, తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ కారు పై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్టిక్కర్ ఉండటం గమనార్హం. దీంతో ఈ నగదును, తమిళనాడు పోలీసులు, ఐటి శాఖ అధికారులకు అప్పచెప్పారు. మామూలు తనిఖీల్లో భాగంగా, ఏపి తమిళనాడు బోర్డర్ లో కారుని తమిళనాడు పోలీసులు ఆపారు. ఈ సమయంలో, కారులో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తులు, తాము చెన్నై వెళ్ళాలి అంటూ, పోలీసుల పై ఒత్తిడి తెచ్చారు. అయితే రాత్రి పూట పంపించం అని తమిళనాడు పోలీసులు చెప్పటంతో, ప్రకాశం జిల్లా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో ఫోన్ చేయించారు. దీంతో వ్యవహారం తేడాగా ఉందని, అనుమానం పడిన తమిళనాడు పోలీసులు, కారుని తనిఖీ చెయ్యగా, భారీగా డబ్బు కనుగున్నారు. దీంతో, కారు సీజ్ చేసిన అధికారులు, కారులో ఉన్న ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదుని ఐటి శాఖకు అప్పచెప్పటంతో, ఐటి అధికారులు రంగంలోకి దిగారు.
నిన్న రాత్రి తమిళనాడు మీడియా మొత్తం, ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రి డబ్బుగా ప్రచారం చేసారు. అయితే దీని పై నిన్న రాత్రి వివరణ ఇచ్చిన బాలినేని, ఇది తన కారు కాదని, ఆ వ్యక్తులతో కూడా తనకు సంబంధం లేదని, తన స్టిక్కర్ ను ఫోటో స్టాట్ తీసి ఎవరో వాడుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ నగదు మొత్తం, ఒంగోలులో వైసీపీలో క్రియాశీలకంగా ఉండే ఒక బంగారు వ్యాపారిది అనే ప్రాధమికంగా తేల్చారు. ఈ డబ్బు తరలించటానికి, రెండు వాహనాలు ఉపయోగించారని, ఒకటి ఒంగోలు నుంచి తమిళనాడు చెక్ పోస్ట్ వరకు, మరొకటి అక్కడి నుంచి చెన్నై వరకు మరో వాహనం ఉపయోగించారని తెలిసింది. అయితే ఇది కేవలం అక్రమంగా బంగారం కొనటానికేనా, లేక ఈ నగదు ఎందుకు ఉపయోగిస్తున్నారు అనే వ్యవహరం పై మరింత కూపీ లాగుతున్నారు. ఒక మంత్రి స్టిక్కర్ ఉన్న కారు, నేషనల్ హైవే పై ధైర్యంగా తిరుగుతున్నారు అంటే, దీని వెనుక ఉన్నది ఎవరు అనేది, ఐటి, తమిళనాడు అధికారులు తేల్చనున్నారు. మరో పక్క టిడిపి నేతలు మాత్రం, ఇది బాలినేని డబ్బే అని, మద్యం ముడుపులు డబ్బులు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరి నిజం ఏమిటో అధికారులే చెప్పాలి.