తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులో భాగంగా, గుంటూరు ఎంపీ అయిన గల్లా జయదేవ్ ని టార్గెట్ చేస్తూ, ఆయన కంపెనీ అయినా అమర రాజా ఇన్ ఫ్రా కు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూముని, జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, అమర రాజా ఇన్ ఫ్రా కంపెనీ విజ్ఞాపి మేరకు, 483.27 ఎకరాల భూమిని ఆ కంపెనీకి ఇచ్చారు. అందులో కంపెనీ నిర్మాణం జరిగి, 5 వేల మందికి పైగా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా పన్నులు కట్టే ఒకానొక కంపెనీగా అమర రాజా ఇన్ ఫ్రాకి పేరు ఉంది. అయితే అమర రాజా కంపెనీకి ఇచ్చిన 483.27 ఎకరాల భూమి నుంచి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, 253.61 ఎకరాల భూమిని వెనక్కు తీసుకుంది. ఆ భూమిని ఇంకా కంపెనీ వాడలేదని, చెప్పినట్టు చేయ్యలదని, అందుకే భూమి వెనక్కు తీసుకుంటున్నట్టు చెప్పింది. అయితే దీని పై అమర రాజా ఇన్ ఫ్రా కంపెనీ అభ్యంతరం చెప్పింది. దీని పై హైకోర్టు మెట్లు ఎక్కింది. తమకు ఏపీఐఐసీ గతంలో కేటాయించిన భూమిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవటం పై అభ్యంతరం చెప్తూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
సరిగ్గా ఇక్కడే సరికొత్త ట్విస్ట్ నెలకొంది. సరికొత్త వాదనతో, ముందుకు వచ్చిన అమర రాజా కంపెనీ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఈ భూమిని తమకు ఏపీఐఐసీ విక్రయించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదని, అలాంటి సమయంలో, ప్రభుత్వం ఈ భూములు వెనక్కు తీసుకోవటం చట్ట విరుద్ధమని కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ విషయంలో ఏమైనా ఉంటే ఏపీఐఐసీ ఆదేశాలు ఇవ్వాలని, ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం వెనుక, దురుద్దేశం ఉందని, కాబట్టి ఆ జీవో రద్దు చెయ్యాలని కోరింది. మరో పక్క, ఇప్పటికే అక్కడ రూ.2700 కోట్లు పెట్టుబడి పెట్టాం అని, ఒప్పందం చేసుకున్న దాని కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని, మొత్తం వివరాలు కోర్టుకు చెప్పింది. దీని పై స్పందించిన ప్రభుత్వ తరుపు న్యాయవాది, సెజ్ ఏర్పాటు చేస్తాం అని చెప్పారని, ఆ హామీ నెరవేర్చలేదు కాబట్టి, భూములు వెనక్కు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని అన్నారు. దీని పై నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది.