టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను 13నెలలైనా పేదలకు స్వాధీనం చేయకుండా వైసిపి వేధించడం గర్హనీయం. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మోకాలడ్డడాన్ని ఖండిస్తున్నాం. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వర్ట్యువల్ యాజిటేషన్స్ తో అయినా వైసిపి ప్రభుత్వం కళ్లు తెరవాలి. వెంటనే లబ్దిదారులకు ఇళ్లు స్వాధీనం చేయాలి, పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి. టిడిపి 5ఏళ్ల పాలనలో రూ50వేల కోట్లతో 25.57లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ‘‘హవుసింగ్ ఫర్ ఆల్’’ పథకాన్ని సద్వినియోగం చేసింది. పట్టణాల్లో 6లక్షల ఇళ్లు, గ్రామాల్లో 19.57లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. కట్టిన ఇళ్ళ జియో ట్యాగింగ్ లో, ఆధార్ సీడింగ్ ద్వారా చెల్లింపుల్లో, దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది. గ్రామాల్లో రూ 12,145కోట్లతో 9,94,222 ఇళ్ళ నిర్మాణం పూర్తి చేశాం. లక్షలాది ఇళ్లకు ‘‘సామూహిక గృహ ప్రవేశాలు’’ జరపడం దేశానికే నమూనా అయ్యింది. దసరా పండుగ సందర్భంగా 2లక్షల ఇళ్లు, సంక్రాంతికి 4లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు జరిపారు. ‘‘పేదల పండుగ’’లాగా ఇళ్ళ నిర్మాణం టిడిపి హయాంలో చేపట్టాం. 101 పట్టణాలు, నగరాల్లో అఫర్డబుల్ హవుసింగ్ ప్రోగ్రామ్(ఎహెచ్ పి) కింద 5.24లక్షల ఇళ్లు, బెనిఫిసియరీ లెడ్ కనస్ట్రక్షన్(బిఎల్ సి) కింద 2లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.

గ్రామీణప్రాంతాల్లో 4రెట్లు, పట్టణాల్లో 7రెట్లు యూనిట్ కాస్ట్ పెంచాం. గ్రామాల్లో యూనిట్ కాస్ట్ రూ70వేల నుంచి రూ 2,90,000కు పెంచాం. 2017-18లో 3లక్షల ఇళ్లు, 2018-19లో 3,30,000 ఇళ్లు నిర్మించాం. రూ1,174కోట్లతో 9,10,000 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశాం. 13నెలల వైసిపి పాలనలో 13జిల్లాలలో హవుసింగ్ కార్యక్రమాలన్నీ నిలిపేయడం బాధాకరం. టిడిపి నిర్మించిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలకు ఇవ్వడంపై ఆ కేంద్రాల్లో ఉన్నవాళ్లే, టిడిపి ఇంతబాగా ఇళ్లు నిర్మించిందంటూ సెల్ఫీ వీడియోలు తీసి మీడియాకు పంపడం తెలిసిందే. వైసిపి మేనిఫెస్టోలో 5ఏళ్లలో 25లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఏడాదికి 5లక్షల ఇళ్లు నిర్మించాల్సి వుండగా అందులో పదోవంతు కూడా కట్టలేదు. తొలి ఏడాది హవుసింగ్ బడ్జెట్ రూ3,617కోట్లలో ఖర్చు చేసింది అతి స్వల్పం. రెండవ ఏడాది బడ్జెట్ రూ 3,691 కోట్లలో పదో వంతు కూడా ఖర్చు చేస్తారన్న నమ్మకం లేదు. ఉచితంగా ఇళ్లు అందజేస్తామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. ఈ 13నెలల్లో ఎంతమందికి ఉచితంగా ఇళ్లు అందజేశారు..? పట్టణాల్లో ఉచిత ఇళ్లు ఇస్తామన్న హామీలో భాగంగా ఎంతమంది టిడ్కో లబ్దిదారుల డిపాజిట్లు వెనక్కి ఇచ్చారు..?

ఇళ్ల నిర్మాణం గాలికి వదిలేశారు, ఇళ్లస్థలాల్లో భారీ స్కామ్ లకు పాల్పడ్డారు. ప్రతి నియోజకవర్గంలో రూ వందల కోట్ల కుంభకోణాలు చేశారు. ఎకరం రూ5లక్షలు పలికే భూమిని రూ 50లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి, ఆ మొత్తాన్ని వైసిపి నాయకులే జేబుల్లో వేసుకున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో, పల్లపు భూముల్లో, స్మశానంలో, అడవుల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడమేంటని ప్రజలే నిలదీస్తున్నారు. ఊరికి దూరంగా స్థలాల్లో ఇళ్లు ఎలా కట్టుకుంటామని నిగ్గదీస్తున్నారు. మడ అడవుల్లో ఎవరైనా ఇళ్లు కట్టుకుంటారా..? 16అడుగుల పల్లపు ప్రాంతం ఆవభూముల్లో ఇళ్లు ఎవరైనా కడతారా..? తూర్పు గోదావరి జిల్లా ఆవభూముల్లోనే రూ400కోట్ల స్కామ్ చేశారు. ఎకరం రూ7లక్షల విలువైన భూమిని రూ70లక్షలకు కొనిపించారు. పల్లపు భూములు మెరకపేరుతో మళ్లీ ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మెరకలోనే రూ1,560కోట్ల కుంభకోణం చేశారు. ఇంటి పట్టా కావాలంటే రూ 30వేలు, రూ60వేలు, రూ లక్షా 10వేలు ఇవ్వాలంటూ, దూరాన్ని బట్టి బలవంతపు వసూళ్లకు వైసిపి నాయకులు తెగబడ్డారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లకు విడుదల చేసిన రూ8వేల కోట్లలో రూ5వేల కోట్లు స్వాహా చేశారు. టిడిపి హయాంలో కట్టిన ఇళ్లు పేదలకు స్వాధీనం చేయకుండా, పెండింగ్ బిల్లులు లబ్దిదారులకు చెల్లించకుండా, వైసిపి నాయకుల జేబులు నింపేందుకే ‘‘సెంటు పట్టాల’’ పేరుతో ఇళ్లస్థలాల అవినీతి కుంభకోణాలకు తెరదీశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదల స్వాధీనం చేయాలి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి, మిగిలిన ఇళ్లు కూడా శరవేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు, శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత

Advertisements

Advertisements

Latest Articles

Most Read