తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గోదావరి వరదలో చిక్కుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలంలోని చించినాడ వద్ద, నిమ్మల రామానాయుడు వెళ్తున్న పడవ నిలిచిపోయింది. ఆ పడవలో నిమ్మల రామానాయుడుతో పాటుగా, మరో 8 మంది ఉన్నట్టు తెలుస్తుంది. బోటు ఆగిపోవటంతో, రామానాయుడు, అధికారులకు విషయం చేర వేసారు. ఆగిపోయిన పడవను ఒక చెట్టుకు లంగరు వేసినా, గోదావరి ఉగ్ర రూపానికి, కదిలిపోతుందని చెప్తున్నారు. గోదావారి వరదల్లో చిక్కుకున్న బాడవ గ్రామానికి నిమ్మల రామానాయుడు పరామర్శించటానికి వెళ్లారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్టటంతో బోటు ఆగిపోయింది. విషయం అధికారులను తెలియ చేసారు. అయితే అధికారులు ఒక చిన్న బోటు పంపించగా, ఆ బోటు కూడా వరదకు తట్టుకోలేక తిరిగి వచ్చేసింది. దీంతో మరో పెద్ద బోటు కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
చివరకు పర్యాటక బోటు పమించాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక బోటు కోసం నిమ్మల ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చీకటి పడుతూ ఉండటంతో, ఎమ్మెల్యే వర్గంతో పాటుగా, అధికారులు కూడా కంగారు పడుతున్నారు. ముందుగానే పెద్ద బోటు పంపించి ఉంటే, ఈ టెన్షన్ ఉండేది కాదని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు. మరో పక్క, గోదావరి వరదల్లో టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చిక్కుకోవడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. విషయం తెలుసుకుని, హుటాహుటిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు ఫోన్ కాల్ చేసారు. ఎమ్మెల్యే రామానాయుడుతో సహా వరదల్లో చిక్కుకున్న గ్రామ ప్రజలను కాపాడాలని చంద్రబాబు కోరారు. తగిన ఏర్పాట్లు చేసి, వెంటనే ఆయనతో పాటు ఉన్న మిగతా వారిని కూడా సేఫ్ గా తీసుకు రావాలని కోరారు.