ఎమ్మెల్యేగా కంటే యూట్యూబ్ స్ఫూఫ్ స్టార్‌గా పేరొందిన ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి దందాల‌న్నీ బ‌య‌ట‌పెట్టిన నారా లోకేష్‌ ధ‌ర్మ‌వ‌రం న‌డివీధులో గుడ్డ‌లిప్పి మ‌రీ నిల‌బెట్టి క‌డిగేశారు. శ‌నివారం యువ‌గ‌ళం పాద‌యాత్ర ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్ట చెరువు మీదుగా వెళుతూ మీడియాకి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెరువును క‌ప్పేసి, గుట్ట‌ని ఆక్రమించి క‌ట్టుకున్న విలాసవంతమైన ఫామ్ హౌస్ ని చూపించారు. ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నంబర్లలో ఎర్రగుట్ట పైన ఉన్న 15 ఎకరాలను దొంగ పత్రాలు సృష్టించి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాజేశారని లోకేష్ ఆరోపించారు. ఎర్రగుట్టపై భూములను కొట్టేయడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. ఎర్రగుట్టపై మరో 5 ఎకరాలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబంలోని మహిళ పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారని.. ఇవి పిత్రార్జితంగా ఆమెకు సంక్రమించినట్లు రికార్డుల్లో చూపారని, కర్నూలు జిల్లాకు చెందిన మహిళ తండ్రికి ధ‌ర్మ‌వ‌రం ఎర్రగుట్టపై ఎలా భూములు వ‌చ్చాయో వెల్ల‌డించాల‌న్నారు. ఎర్ర‌గుట్ట‌ ఉన్న సర్వే నంబర్ల రికార్డులు ఆర్.టి.ఐ ద్వారా కోరితే రికార్డులే లేవ‌ని స‌మాధానం ఇచ్చార‌ని, రికార్డుల్లో లేని భూమి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరుతో ఎలా నమోదు అయిందని ప్రశ్నించారు. పోతుల నాగేపల్లి పరిధిలోని 42, 43 సర్వే నెంబర్లలో అసైన్డ్ భూములను క‌బ్జాకి ఎమ్మెల్యే ప్ర‌య‌త్నించ‌గా, అడ్డుకున్న‌ అప్పటి కలెక్టర్ గంధం చంద్రుడిని బ‌దిలీ చేయించార‌ని సంచ‌ల‌న విష‌యాలు లోకేష్‌ వెల్ల‌డించారు.గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి చేసేవి కబ్జాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లు అని లోకేష్ మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా అంతా ఎమ్మెల్యే క‌నుస‌న్న‌ల్లోనే సాగుతోంద‌న్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ అక్రమాలతో పాటు రాష్ట్రంలోని వైకాపా ఎమ్మెల్యేలందరి అవినీతిపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్ర‌క‌టించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read