విజయవాడ ఎంపీ కేశినేని నాని గత కొంతకాలంగా వైకాపా నేతలని పొగుడుతూ వారితో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. టిడిపి ఎంపీగా గెలిచినా, టిడిపికి కార్యక్రమాలకు దూరం పాటిస్తూ వస్తున్న కేశినేని నాని అధిష్టానంపై అప్పుడప్పుడు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. టిడిపి పెద్దలు కేశినేని నానిని గౌరవిస్తూనే ఆయన అసహనం వెనుక వ్యూహాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వస్తోంది. ఎన్నికల మూడ్ రాష్ట్రంలో నెలకొన్న వేళ, కేశినేని నాని బయటపడిపోయారు. పూర్తిగా వైకాపా నేతలతో తన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలలో వైకాపా ఎమ్మెల్యేలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, నా రాజకీయం ఇలాగే ఉంటుంది, నచ్చిన వాళ్ళతో కలిసి పని చేస్తానని, రాజకీయం ఎప్పుడూ చేయకూడదని, ఎన్నికల సమయంలోనే చేయాలని చెప్తున్నారు. నాని మాటలతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడుతూ వచ్చిన టిడిపి, ఇప్పుడు కేశినేని నాని మాటలను గమనిస్తుంది. వైసీపీతో విజయవాడ ఎంపీ టచ్లో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరో పక్క, కేశినేని నాని వైఖరితో ఇప్పటికే ప్రత్యామ్నాయం కోసం టిడిపి ఆయన తమ్ముడు చిన్నిని టచ్లో పెట్టుకుందని తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటులో అభివృద్ధి కోసం గొంగళి పురుగుని ముద్దు పెట్టుకుంటానంటూ చెప్తున్న కేశినేని నాని...విజయవాడ మెట్రో రైలుని వైకాపా సర్కారు ఎత్తేస్తే నోరు మెదపకపోవడం వెనుక, విమర్శలు వస్తున్నాయి. టిడిపి విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టలదొరకైనా ఇచ్చుకోవచ్చంటూనే, తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాననడం కేశినేని నాని తన అహంకార ధోరణిని మరోసారి బయట పెట్టారని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. మొన్న మొండితోక, నిన్న వసంతతో కలిసి ప్రెస్ మీట్ లు పెడుతున్న నాని నేడో రేపు ఊహించని నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
వరుసుగా వైసీపీ నాయకులతో కలిసి పెడుతున్న ప్రెస్ మీటలు దేనికి సంకేతం ?
Advertisements