తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారనే పేరుంది. సీఎంగా ఉన్నా, ప్రతిపక్షనేతగా ఉన్నా నిర్ణయాలు తీసుకోవడంలో నాన్చుడు ధోరణితో పార్టీ నేతలే విసిగిపోయారు. దశాబ్దాల తన తీరుకి భిన్నంగా చంద్రబాబు జెట్ స్పీడుతో తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో కొత్త ఉత్సాహం నింపాయి. మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ప్రకటించి అధికార వైసీపీని అయోమయంలోకి నెట్టేసిన బాబు, టిడిపి కేడర్‌లో జోష్ నింపారు. మరోవైపు పొత్తులు విషయం కూడా తేల్చేశారు. జనసేనతో ఎన్నికలకి వెళ్తారనే సంకేతాలు లీడర్ల నుంచి కేడర్ వరకూ స్పష్టం చేసేశారు. టికెట్ల ఎంపిక విషయంలో సీబీఎన్ స్పీడు మామూలుగా లేదు. గత ఎన్నికలకి తాను సీఎంగా ఉన్నా, ఎన్నికల తేదీలు ప్రకటించినా..అభ్యర్థుల ఎంపిక నామినేషన్లు వేసేవరకూ నాన్చి తీవ్రంగా నష్టపోయారు. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి సీటు కూడా నామినేషన్ వేసే ముందు ప్రకటించడం, ఎన్నికల సన్నాహాలకి కూడా సమయం లేని పరిస్థితి ఎదురైంది. 2024లో జరగాల్సిన ఎన్నికలు ముందస్తుగా వచ్చినా తాము రెడీ అంటూ సంకేతాలిస్తున్నారు బాబు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పొత్తులు ఖరారైపోయాయి. అభ్యర్థులని దాదాపు ప్రతీ కార్యక్రమంలోనూ ప్రకటించేస్తున్నారు. దాదాపు 130 స్థానాలకు అభ్యర్థులని ఖరారు చేసేసి పనిచేసుకోమని బాబు చెప్పేశారని టిడిపిలో చర్చ నడుస్తోంది. తాజాగా సత్తెనపల్లి టిడిపి ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణని ప్రకటించిన బాబు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముందెన్నడూ లేని చంద్రబాబు స్పీడు చూసి టిడిపి నేతలు, కార్యకర్తలు ఉరుకుపరుగులు పెడుతూ పనులు చేస్తున్నారు. రాజమహేంద్రవరం మహానాడులో రాత్రి మేనిఫెస్టో ప్రకటిస్తే, తెల్లారేసరికి చాలా మంది నేతలు ఆ కరపత్రాలు పట్టుకుని ఇంటింటికీ ప్రచారానికి దిగారు. చంద్రబాబు స్పీడు చూసి వైకాపా క్యాంపులో ఉన్న నిస్తేజం కాస్తా డైలమాగా మారింది. వైకాపా నుంచి సీనియర్లే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటిస్తున్నారు. మరికొందరిని జగన్ తప్పిస్తారనే టాక్‌తో గందరగోళం నెలకొంది.
ముందెన్నడూ లేని ముందస్తు స్పీడులో చంద్రబాబు.. డైలమాలో జగన్
Advertisements