తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడూ కోపంగా మనకి కనిపిస్తారు. మాట్లాడితే ఆగ్రహంగా ఊగిపోతూ ఉంటారు. బేల మాటలుండవు. నీ ప్రతాపమో, నా ప్రతాపమో తేల్చుకుందాం రా అనే టైపు. వందల కోట్ల వ్యాపారాలపై దాడులు చేయించి మూసేయించినా బెదరలేదు. అక్రమకేసులతో అరెస్టు చేసి జైలులో వేసినా లొంగలేదు. ఏనాడూ ఒక్క కన్నీటి చుక్క కార్చలేదు. తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాడిపత్రిలో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా ముగిసిన అనంతరం జెసి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర తరువాత లోకేష్ నీ చూస్తే బాధేసిందన్నారు. లోకేష్ పుట్టుకతోనే వజ్ర.. వైఢూర్యాలు చూసిన వ్యక్తి అని, అన్ని ఆస్తులు సంపాదించిన తాత పెంపకంలో పెరిగిన వ్యక్తి లోకేష్ అని కొనియాడారు. చిన్నప్పటి నుంచి లోకేష్ పెరిగిన విధానం దగ్గరుండి చూసిన వ్యక్తిగా లోకేష్ పాదయాత్ర లో పడుతున్న అవస్థలు చూసి బాధ పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ చేస్తున్న త్యాగం ప్రజల కోసమేనని లోకేష్ ఒక కర్మజీవి అంటూ ప్రశంసించారు. బంగారు స్పూనుతో పుట్టిన లోకేష్ ఎండ అంటే ఏంటో తెలియకుండా పెరిగారని, ఉన్నత చదువులు చదివారని, అన్నీ వదులుకుని ప్రజల కోసం మండుటెండల్లో నడుస్తుండడం చూస్తే హృదయం ద్రవించిపోతోందని జేసీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించేందుకు లోకేష్ చేస్తున్న పాదయాత్ర విజయవంతం అవుతోందన్నారు. యావత్తు ఆంధ్ర ప్రదేశ్ పిల్లల భవిష్యత్ కోసం అని లోకేష్ చెప్పిన మాటలు ఉత్తేజపూరితంగా ఉన్నాయని, లోకేష్ పిరికివాడు కాదు..తాత ఎన్టీఆర్ ఆశయాలను పుణికిపుచ్చుకున్నాడని కొనియాడారు. ఎన్ని ఇబ్బందులైనా ఓర్చుకుని ఇచ్ఛాపురం వరకు లోకేష్ నవ్వుతూనే పాదయాత్ర పూర్తి చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడుతున్నారు.....నాయకులు మాత్రం భయంతో బతుకుతున్నారని, తమకి చెందిన అన్ని వ్యాపారాలు మూసేసినప్పటికి మేము భయపడటం లేదని జేసీ చెప్పుకొచ్చారు. ప్రజల మద్దతు లోకేష్ కి వుందని, టిడిపి నుంచి ఎవరు గెలవాలన్న చంద్రబాబు పోటో వుండాల్సిందేనని ప్రభాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. జగన్ చేస్తున్న తప్పులు....లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపిస్తుందన్నారు. కార్యకర్తల కష్టాన్ని మర్చిపోవద్దు అంటూ నేతలకు హితవు చెప్పారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి తొలిసారి కన్నీరు పెట్టాడు
Advertisements