అమరావతి ప్రజారాజధాని అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. నిర్బంధాలని ఎదిరించి మరీ నిలబడింది. న్యాయస్థానాలలో గెలిచింది. దేశసర్వోన్నత న్యాయస్థానంలో న్యాయం కోసం జూలై 11 వరకూ నిరీక్షిస్తోన్న అమరావతి ఉద్యమకారులు..తమ మొక్కులు చెల్లించుకునేందుకు మరోసారి ఉపక్రమించారు. మూడు ముక్కలాటతో ప్రజారాజధాని అమరావతికి సమాధి కట్టేందుకు పాలకులు చేసిన కుట్రలు, కుతంత్రాలపై ప్రజా ఉద్యమం ఆరంభమై 1200 రోజులు పూర్తయ్యాయి. కేసులు, నిర్బంధాలు, దాడులు ఎదిరించి అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని సాగించారు. వైసీపీ సర్కారు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అలుపెరగని ఉద్యమం చేసిన రైతులు, కూలీలు ఎన్నో త్యాగాలు చేశారు. చంద్రబాబు పిలుపు మేరకు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు 29 వేల మంది జగన్ సర్కారు బాధితులుగా రోడ్డున పడ్డారు. శాంతియుతమైన నిరసనలు, న్యాయపోరాటంతో అమరావతి ఉద్యమం ఏళ్లుగా కొనసాగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అమరావతి నుంచి తిరుపతి పాదయాత్ర చేశారు. అమరావతి నుంచి అరసవల్లి వరకూ పాదయాత్ర చేస్తుండగా ప్రభుత్వమే కుట్రపూరితంగా అడ్డుకుంది. అమరావతి పరిరక్షణ సమితి, రైతులు వేసిన కేసుల్లో అమరావతే రాజధాని అని పేర్కొంటూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. గతేడాది మార్చి 3న అమరావతే రాజధాని అని తీర్పు ఇచ్చిన తరువాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లింది. అక్కడ కూడా అత్యవసరంగా విచారణ జరిపాలని, హైకోర్టు తీర్పుపై స్టే కావాలని కోరినా ఫలితం దక్కలేదు. అమరావతిని ధ్వంసం చేసి, పూర్తిగా సమాధి చేయాలని వైసీపీ సర్కారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అమరావతి అజరామరమని ఒక్కో న్యాయస్థానం తీర్పూ తేల్చేస్తోంది. దీంతో కోర్టు ఆదేశాలతో నిలిచిన మహాపాదయాత్ర-2ని, కోర్టు ఆదేశాలు ధిక్కరించకుండా చేపట్టాలని అమరావతి రైతులు నిర్ణయించారు. ఈనెల 31న బస్సుల్లో అరసవల్లి వెళ్లి మొక్కులు తీర్చుకోనున్నారు.
ప్రజా ఆకాంక్షగా నిలిచి ప్రజారాజధానిగా గెలుస్తోంది అమరావతి
Advertisements