విశాఖ సాగర తీరానికి మధ్యాహ్న సమయాల్లో వచ్చేవారు కొద్ది సేపు చెట్లకింద సేదదీరడానికి అనువైన ప్రదేశం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో, 12 గంటల వ్యవధిలో తీరంలో వంద కొబ్బరి చెట్లతో శనివారం ఏకంగా ఒక తోటనే సృష్టించేశారు. పగటి వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు తీరానికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించడమే కాక తీరానికి కొత్త అందాలు అద్దాలనే ఉద్దేశంతో కొబ్బరిచెట్లు ఏర్పాటుచేశారు. సీఎస్ఆర్ లో భాగంగా నగర శివారులో ఉన్న సరే రిసార్ట్స్ అధినేత రాజాబాబు సామాజిక బాధ్యత కింద తాము వంద కొబ్బరిచెట్లు నాటి, తోటను పెంచుతామని జీవీఎంసీ అధికారులకు ప్రతిపాదించారు.

vizag 19082018 2

జీవీ ఎంసీ కమిషనర్ అనుమతించడంతో శనివారం ఉదయం పదిగంటలకు వంద చెట్లను వై. ఎం. సి. ఎ. ఎదురుగా ఉన్న తీరంలో నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పది నుంచి 15 ఏళ్ల వయసున్న కొబ్బరిచెట్లను వేళ్లతో పెరికించి లారీల్లో తీరానికి తీసుకొచ్చారు. సాధారణంగా బాగా పెరిగిన మొక్కను వేరే చోట నాటితే వాటికి భూమి నుంచి నీళ్లు, పోషకాలు అందేలోపే ఎండిపోతాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి చెట్లకు ఉండే 85 శాతం మట్టలను తొలగించేశారు. అలా వాటికుండే ఆకుల నుంచి చెట్టులోని తేమ ఆవిరి కాకుండా నిరోధించారు. అదే సమయంలో ప్రతి కొబ్బరిచెట్టు కాండానికి గడ్డితో పేనిన తాడును చుట్టారు. వాటిని తడుపుతూ ఉంటే చెట్టుకు అవసరమైన నీరందుతుంటుంది. చెట్టు బతకడా నికి అవసరమైన పోషకాలను కూడా ఇస్తున్నారు. వారం పాటు జాగ్రత్తగా కాపాడుకుంటే చెట్టు బతికినట్లే.

vizag 19082018 3

సముద్రతీరంలో నాటడు వల్ల ఇసుక నుంచి పోషకాలు అందే అవకాశం లేదు. ఏడాదిపాటు పోషకాలను అందించాలి. ఆలోపు చెట్లు వేళ్లు భూమి లోపలికి బాగా చొచ్చుకుపోయి దానంతటదే బతికే స్థాయికి చేరుకుంటుంది. అప్పటి వరకు సన్ రే సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. 15 ఏళ్లపాటు పెరిగిన చెట్టును ట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో ఒకచోట నుంచి మరోచోటకు మార్చడం అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. వేళ్లు దెబ్బతినకుండా దాని చుట్టూ సుమారు ఎనిమిదడుగుల లోతున తవ్వి జాగ్రత్తగా పెకలిస్తారు. తల్లివేరు, పిల్ల వేళ్లు నిర్ణీత పొడవు ఉండేలా కత్తిరిస్తారు. అనంతరం చెట్టు మొదలు చుట్టూ వస్త్రం కట్టేసి మూడు నాలుగు గంటల వ్యవధిలో నాటాల్సిన ప్రదేశానికి తరలిస్తారు. చెట్టు మొదలు సహా నాటడానికి వీలుగా నాలు గైదు అడుగుల లోతున గొయ్యి తవ్వి అందులో చెట్టు మొదలు మొత్తం పట్టేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తీరంలో ఐదు పొక్లెయిన్లు, రెండు క్రేన్లు ఉపయోగించి జాగ్రత్తగా చెట్లు నాటారు. శనివారం ఉదయం 10 గంటలకు మొదలైన ఈ ప్రక్రియలో రాత్రి పదిగంటలకు వంద చెట్లు నాటారు.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read