మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, రాష్ట్ర ప్రభుత్వానికి, సంచయితకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. సంచయిత గజపతి రాజుని మాన్సాస్ చైర్మెన్ గా నియమిస్తూ, అశోక్ గజపతి రాజుని తొలగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం గతంలో నియామక ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా సంచయిత మాన్సాస్ చైర్మెన్ గా విధులు నిర్వహించారు. అయితే దీని పై అశోక్ గజపతి రాజు ఈ ఉత్తర్వులు పై హైకోర్టులో సవాల్ చేసారు. దీని పై హైకోర్టు సింగల్ బెంచ్ లో, గతంలో విచారణ జరిగింది. అక్కడ హైకోర్టు సింగల్ బెంచ్, మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ గా అశోక్ గజపతి రాజుని మళ్ళీ చైర్మెన్ గా నియమిస్తూ, సంచయిత నియామకాన్ని కొట్టేస్తే తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు పై, రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా, సంచయిత గజపతి రాజు మళ్ళీ హైకోర్టు డివిజనల్ బెంచ్ కు వెళ్ళి అపీల్ చేసారు. డివిజనల్ బెంచ్ లో ఈ విషయం పై దాదాపుగా నెల రోజులు నుంచి కూడా విచారణ జరుగుతూ వస్తుంది. ఈ రోజు తుది విచారణ జరిగింది. ఈ తుది విచారణ సందర్భంగా సంచయిత గజపతి రాజు, అదే విధంగా ప్రభుత్వం రెండూ కూడా, మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ గా సంచయితను కొనసాగించాలని, సింగల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొట్టేయాలని కూడా హైకోర్టుని అభ్యర్ధించారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ గా అశోక్ గజపతి రాజు ఉండగా, అవకతవకలు జరిగాయని చెప్పి, వాళ్ళు వాదించారు.
సంచయిత, ఆనంద గజపతి రాజు కుమార్తె అని, అందు వల్ల వారాసురాలిగా ఆమెకు హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ఇక అశోక్ గజపతి రాజు న్యాయవాదులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించారు. అశోక్ గజపతి రాజు చైర్మెన్ గా ఉన్న సమయంలో, ఎటువంటి అవకతవకలు జరగలేదని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వం, ఇవన్నీ చేస్తుందని వాదించారు. దీంతో పాటు, ఇటీవల మాన్సాస్ ట్రస్ట్ లో కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన విషయాన్ని, అశోక్ పై కేసులు పెట్టిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఇరువురు వాదనలు ఉన్న హైకోర్టు, ఈ రోజు తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. మాన్సాస్ చైర్మెన్ గా అశోక్ గజపతి రాజుని కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సమర్ధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత ఇచ్చిన పిటీషన్లు హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో అశోక్ గజపతి రాజు ఇక మాన్సాస్ చైర్మెన్ గా కొనసాగనున్నారు. మరి ప్రభుత్వం, సంచయిత సుప్రీం కోర్టుకు కూడా వెళ్తారేమో చూడాలి.