జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గత నెల రోజులుగా అన్ని వర్గాల నుంచి, అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరిని కదిలించినా ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నారు. అధ్వానమైన రోడ్డులు ఒక పక్క, పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక పక్క, కరెంటు చార్జీలు పెంపు ఒక పక్క, పెన్షన్లు పీకి వేయటం ఒక పక్క, శాంతి భద్రతల సమస్యలు, మటన్ మార్ట్ లు, సినీమా టికెట్లు, ఇలా ఒకటి కాదు, రెండు ఏది పట్టుకున్నా, ఏకు మేకై కూర్చుంది. తీవ్ర అసంతృప్తిలో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా రోడ్డుల విషయానికి వస్తే, ప్రజలకు పిచ్చేక్కటం ఒక్కటే తక్కువ. ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితి. నేషనల్ హైవేలు తప్ప, అన్ని రోడ్డులు నాశనం అయిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రోడ్డుల మరమత్తులు చేయకపోవటంతో, ఏ రోడ్డు పట్టుకున్నా నాశనమైన రోడ్డులే కనిపిస్తున్నాయి. ఇది ఒక పక్కన పెడితే, కొన్ని రోడ్డులకు టెండర్లు పిలిచినా, వచ్చే వారు లేకుండా పోయారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవటంతో, కొత్త రోడ్డులు వేయటానికి కాంట్రాక్టర్లు రాని పరిస్థితి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక స్థితి కూడా ఇందుకు కారణం అనే చెప్పాలి. గత ఏడాది 600 కోట్లు కేటాయించి రోడ్డుల మరమ్మత్తులు చేస్తున్నాం అని చెప్పినా, ఒక్క రోడ్డు కూడా వేసింది లేదు.
ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, ఒక ఆర్టిఐలో , ఈ రెండేళ్ళలో కేవలం రూ.15 కోట్ల వరుకే రోడ్డుల మరమ్మత్తులకు ఖర్చు పెట్టినట్టు చెప్పారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రోడ్డుల పై ప్రజలే కాదు, సొంత పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా, దండం పెడుతున్నారు. వారం క్రితం గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే ఈ రోడ్డుల పై తిరగలేక పోతున్నాం అంటూ బహిరంగ వెదిక పైనే చెప్పారు. ఇప్పుడు తాజాగా, యలమంచలి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి, రోడ్డులు దారుణంగా ఉన్నాయని, రోడ్డులు వేయాల్సిందిగా కోరారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ, రోడ్డులు వేయటానికి డబ్బులు ఏవి అంటూ ఎదురు ప్రశ్నించారు. అన్ని రోడ్డులు వేయటానికి నేనేమైనా దేవుడినా అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రం మొత్తం రోడ్డులు అలాగే ఉన్నాయని, ఏమి చేయలేం అని, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటూ చెప్పిన ఆడియో వైరల్ అయ్యింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, రాష్ట్ర రోడ్డులు ఎలా ఉన్నాయో ఎమ్మెల్యే మాటల్లోనే అర్ధం అవుతుంది.