ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధి హామీ బిల్లులు చెల్లించకుండా చేస్తున్న పనులకు, ఇప్పటికే కోర్టుల్లో అనేక మార్లు అక్షింతలు పడిన సంగతి తెలిసిందే. మొన్న కోర్టు విచారణలో, హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం కూడా సరైన వివరాలతో అఫిడవిట్ వేయక పోవటంతో, కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అవ్వటమో, లేక కేంద్రమే అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవలనో కానీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటుగా, ఇతర అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు అయ్యారు. అయితే ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కధనం ప్రకారం, కేంద్ర అధికారుల ప్రశ్నలకు ద్వివేదితో పాటుగా, ఇతర అధికారులు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వం పంపించిన లేఖలు కూడా చదవలేదని చెప్పటంతో, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆ పేపర్ ప్రచురించింది. అలాగే ఉపాధి హామీ బిల్లులు పెండింగ్ విషయంలో కూడా కేంద్ర అధికారులు, రాష్ట్ర అధికారుల పై ప్రశ్నల వర్షం కురిపించగా, దానికి కూడా సమాధానం చెప్పలేక పోయారు.
రాష్ట్ర హైకోర్టు కేంద్ర అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసిందని, మీకు నిధులు ఇచ్చి, కోర్టుల చేత మేము చీవాట్లు తింటున్నాం అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే ఉపాధి హామీ తనిఖీ రిపోర్ట్ లు కేంద్రం యాప్ లో నమోదు చేయాల్సి ఉండగా, ఒక్క నివేదిక కూడా కేంద్రానికి రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అధిక పని దినాలు కల్పించాం అంటూ చెప్పిన వివరాల పై కూడా అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నిజంగానే అన్ని పని దినాలు కల్పించారా, లేక కాగితాలకే పరిమితమా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వ్యవసాయ పనులు మొదలైన తరువాత కూడా, ఇన్ని పని దినాలు ఎలా కల్పించారు అంటూ అనుమానం వ్యక్తం చేసారు. ఈ ప్రశ్నలకు అధికారులు అవక్కయ్యారని తెలుస్తుంది. నేరుగా సమాధానం చెప్పలేక పోయినట్టు సమాచారం. ఇక అలాగే, సాఫ్ట్ వేర్ వినియోగం పై కూడా కేంద్ర అధికారులు ప్రశ్నించారు. అందరూ కొత్త సాఫ్ట్ వేర్ వాడుతుంటే, కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పాతది వాడుతుందని అన్నారు. త్వరలోనే రాష్ట్రానికి వచ్చి, మీ నివేదికలు ఆధారంగా క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తాం అని చెప్పినట్టు సమాచారం.