ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వీకెండ్ షాక్ అనే చెప్పాలి. శనివారం సాయంత్రం వస్తున్న ఈ న్యూస్ తో, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీకి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాయలసీమ ఎత్తిపోతల పధకంకు సంబంధించి, కృష్ణా రివర మ్యానేజ్మెంట్ బోర్డు, ఈ నెల 11, 12వ తెదేల్లో ప్రాజెక్ట్ ప్రదేశంలో పర్యటించింది. రాష్ట్ర గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ప్రకారం, అక్కడకు ప్రత్యక్షంగా వెళ్లి తనిఖీలు చేయటం జరిగింది. ఆ తనిఖీల తరువాత, కేఆర్ఎంబీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించింది. సుమారుగా 12 పేజీలు ఉన్న ఈ నివేదికలో, గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యవరణ అనుమతులు లేకుండా అక్కడ పనులు చేపట్టవద్దు అంటూ ఆదేశాలు ఇచ్చిందో, ఆ `ఆదేశాలకు విరుద్ధంగా అక్కడ పనులు జరిగినట్టు కృష్ణా రివర మ్యానేజ్మెంట్ బోర్డు గుర్తించింది. అయతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, అక్కడ మేము కేవలం డీపీఆర్ కోసం మాత్రమే అక్కడ పనులు జరుగుతున్నాయని, ప్రాజెక్ట్ పనులు అక్కడ ఏమి జరగటం లేదని, ప్రాజెక్ట్ పనులు చేపట్టినట్టు మీరు నిర్ధారిస్తే, తగు చర్యలు తీసుకోవచ్చు అంటూ చీఫ్ సెక్రటరీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక అఫిడవిట్ దాఖలు చేసారు. అయితే తరువాత కొన్ని రోజులకు మళ్ళీ తెలంగాణా ప్రభుత్వం ఎన్జీటీ దగ్గరకు వచ్చింది.
అక్కడ ఎన్జీటీ తీర్పుకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి అంటూ తెలంగాణా ప్రభుత్వం, ఎన్జీటీ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. తమ ఆదేశాలు ధిక్కరించి, అక్కడ పనులు జరుగుతున్నట్టు తెలిస్తే, చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేఆర్ఎంబీని పరిశీలనకు వెళ్ళమని చెప్పింది. కొన్ని అవాంతరాలు తరువాత, కేఆర్ఎంబీ రెండు రోజుల క్రిందట అక్కడ పరిశీలనకు వెళ్ళింది. అయితే తమ పరిశీలనలో అక్కడ తీర్పు ధిక్కరించి పనులు చేసినట్టు నివేదికలో తెలిపింది. పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ ఈ విధంగా అన్ని పనులూ అక్కడ పూర్తి చేసారని పేర్కొన్నారు. ఈ మేరకు ఫోటోలతో సహా అక్కడ జరిగిన పనుల వివరాలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఇచ్చారు. అయితే ఈ కేసు విచారణ సోమవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందకు రానుంది. మరి ఈ రిపోర్ట్ చుసిన ఎన్జీటీ ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది ? ధిక్కరణకు పాల్పడినట్టు తేలితే, చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతాం అంటూ, గతంలో చెప్పిన ఆదేశాలను అమలు చేస్తుందా అనేది చూడాల్సి ఉంది.